HO Quota In Indian Railways : సెలవుల సమయంలో రైల్వే టికెట్లు దొరకడం చాలా కష్టం. పైగా పలు ప్రత్యేక ట్రైన్లలో సీట్లు ముందుగానే దొరకాలంటే చాలా కష్టం. దీనికోసం కొన్ని రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనుకున్నదానికంటే మించి ప్రజల నుంచి అభ్యర్థనలు వస్తే వెయిటింగ్ లిస్టు భారీగా పెరుగుతుంది. అలాంటి సమయాల్లో మన పేరు కూడా వెయిటింగ్ లిస్టుకే పరిమితమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పండగ సమయాల్లో భారీగా రాకపోకలు ఉంటాయి. అన్ని రకాల రవాణా వ్యవస్థలు ప్రజలతో కిటకిటలాడుతాయి. తెలంగాణలో దసరాకు, ఆంధ్రాలో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు జనాలు ఎగబడతారు. ఈ పండగలకు నెల రోజుల ముందు నుంచే తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. బస్సు, రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ ఆ సమయాల్లో రద్దీ దృష్ట్యా బుకింగ్ కన్ఫర్మ్ అవ్వక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకూ ఇలాంటి సమస్యనే ఎదురైతే ఈ విధంగా టికెట్లు కన్ఫార్మ్ చేసుకోండి.
మీ టికెట్ ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే.. దాన్ని వెంటనే నిర్ధరించుకోవడానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే.. రైల్వే ఉన్నతాధికారులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులకు రైల్వేలో HO కోటా (హై అఫీషియల్) /ఎమర్జెన్సీ కోటా కింద బెర్త్‌లుంటాయి. అయితే.. ఇవి ఖాళీగా ఉంటే వీటిని అత్యవసర సమయాల్లో ఎవరికైనా కేటాయించే అధికారం రైల్వే అధికారులకు ఉంటుంది. ఈ కోటాలో కొన్ని షరతుల ద్వారా మీరు టికెట్ కన్ఫార్మ్ చేసుకుని సీట్లు పొందొచ్చు.
అసలేంటీ కోటా ?
ఈ HO కోటా అనేది రైల్వే ఉన్నతాధికారులు, వీఐపీలు, ఇతర ప్రముఖుల కోసం ఏర్పాటు చేసింది. అయితే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సాధారణ ప్రయాణికులు కూడా ఇందులో ప్రయాణించవచ్చు. ప్రయాణికుల ప్రాధాన్యం చొప్పున వీటిని కేటాయిస్తారు. సీనియర్ సిటిజన్లు వీటిని పొందేందుకు ఎక్కువ అవకాశముంటుంది. జనరల్ కోటాలో బుక్ చేసుకున్నవారికి గానీ, వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి గానీ వీటిని కేటాయిస్తారు. ఈ కోటా కింద కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు. కాబట్టి.. వీటి కింద అప్లై చేసుకుంటే టికెట్ తొందరగా కన్ఫర్మ్ అవుతుంది.
టికెట్ పొందాలంటే వర్తించే షరతులివే..
ఈ సీటు పొందాలనుకునే వారి ప్రయాణం ఎమర్జెన్సీది అయి ఉండాలి. వీటిని కేటాయించాలంటే అందుకు తగిన ముఖ్య కారణం వెల్లడించాలి. వారికి సంబంధించి ఐడెంటిఫికేషన్ లాంటి ధ్రువపత్రాలు కూడా సమర్పించాలి. సాధారణ ప్రయాణికులు.. ఈ కోటాలో సీటు పొందాలంటే రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందే అత్యవసర కోటా (EQ) ఫారమ్‌ను నింపి చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు సమర్పించాలి. దీనికి మన అత్యవసర ప్రయాణానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ జతచేయాలి.
ఫారమ్, వ్యాలిడ్ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా.. ఈ దరఖాస్తుపై గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం కూడా చేయించాలి. దరఖాస్తు స్వీకరించి వారు మీకొక రశీదు ఇస్తారు. ఆ తర్వాత సంబంధిత డివిజనల్/జోనల్ కార్యాలయానికి సమాచారం వెళుతుంది. వారి నుంచి ఆమోదం వస్తే.. టికెట్ కన్ఫార్మ్ అవుతుంది.
రైలు హారన్లు 11 రకాలని మీకు తెలుసా? వాటి అర్థాలు తెలిస్తే షాకే!