ఆత్మనిర్భర్ భారత్... ప్రధాని నరేంద్ర మోదీ కల. 2020లో కరోనా సంక్షోభం మధ్యలో ఈ నినాదం ప్రాముఖ్యం సంపాదించుకుంది. కానీ రక్షణ రంగంలో దీని ప్రభావం ఎంత ఉంటుందన్నది ప్రశ్నార్థకం.
భారత 'రక్షణ'...
సీఐపీఆర్ఐ(స్టాక్‌హోం ఇంటెర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న రెండో అతిపెద్ద దేశం భారత్. తొలిస్థానంలో సౌదీ అరేబియా నిలిచింది. రఫేల్ వంటి యుద్ధ విమానాల నుంచి.. సాధారణ ఆయుధాల వరకు అన్నింటినీ దిగుమతి చేసుకుంటోంది భారత్. రక్షణ విభాగంలో ఎక్కువగా ఖర్చుపెడుతున్న మూడో అతిపెద్ద దేశంగా ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి.
రక్షణపై ఇంత భారీగా ఖర్చులకు కారణాలు లేకపోలేదు. చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకోవడం వీటిలో ప్రధానమైంది.
ఇదీ చూడండి:- రూ.13,700 కోట్ల ఆయుధ కొనుగోళ్లకు ఆమోదం
ఈ తరుణంలో.. రక్షణ రంగంలో భారత్.. స్వయం సమృద్ధ దేశంగా ఎదగాల్సిన ఆవశ్యకత పెరిగిపోయింది. అందుకే.. 2021 బడ్జెట్లో రక్షణ కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం. కొనుగోళ్లను రెండుగా విభజించింది. దేశీయ, విదేశీ కొనుగోళ్లు. ఇందులో 63శాతం(రూ. 70,221 కోట్లు) నిధులను దేశీయ రక్షణ కొనుగోళ్ల కోసం పక్కనపెట్టింది. దేశీయంగా ఉన్న పరిశ్రమలు, మధ్యస్థాయి సంస్థలు, అంకురాలపై దీని ప్రభావం ఉంటుంది.
వీటితో పాటు మరికొన్ని చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం. అవి..
- రక్షణకు సంబంధించి 101 వస్తువుల దిగుమతిని ఇప్పటికే నిషేధించింది. ఇంకో జాబితా త్వరలో వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. దేశీయ పరిశ్రమలు ఆయా వస్తువులను ఉత్పత్తి చేయాల్సిందే.
- హెయూఎల్(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)తో రూ. 48వేల కోట్లతో.. 83 దేశీయ ఎమ్కే 1ఏ- తేజస్ విమానాల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ఇంకో ఒప్పందం కూడా కుదిరే అవకాశముంది.
- రూ. 10వేల కోట్లతో చిన్న, మధ్యస్థాయి సంస్థలకు కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు.. పలు నిబంధనల్లో సడలించి వ్యాపార సంస్థలకు ఊతమందించింది.
- 8 అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను.. డీఆర్డీఓ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. పరిశోధనలకు ఇవి ఉపయోగపడతాయి.
- భారత్‌లో పరిశ్రమల ఏర్పాటు, దేశీయ సంస్థలతో జాయింట్ వెంచర్ నిర్వహణ కోసం విదేశీ సంస్థలను ప్రోత్సహిస్తోంది.
- డీపీఈపీపీ 2020(రక్షణ ఉత్పత్తి- ఎగుమతి ప్రచార విధానం), డీఏపీ(రక్షణ కొనుగొళ్ల ప్రక్రియ 2020)లో స్వయం సమృద్ధికి పెద్దపీట వేసింది.
అంత సులువు కాదు..!
రక్షణ మంత్రిత్వశాఖ, సాయుధ దళాలు, దేశీయ రక్షణ పరిశ్రమల మధ్య ఉన్న బంధంపైనే రక్షణశాఖలో ఆత్మనిర్భర్ భారత్ ఆధారపడి ఉంటుంది. కానీ వీటి మధ్య సహకారం లోపించింది.
అమెరికా, పశ్చిమ ఐరోపా తరహాలో.. రక్షణ పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య సహకారం.. భారత్‌లో కనపడటం లేదు. కలిసిగట్టుగా పనిచేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.
ఇదీ చూడండి:- 'రక్షణ రంగ కేటాయింపుల్లో 60 ఏళ్ల రికార్డ్ రిపీట్!'
చైనాతో ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుంటే.. రక్షణపరంగా ఎన్నో అంశాల్లో వృద్ధి ఆవశ్యకత తెలుస్తుంది. దేశీయ పరిశ్రమలు చేతికందడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అప్పటివరకు సైనిక అవసరాల పరిస్థితి ఏంటి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అదే సమయంలో.. ఓవైపు దేశీయ రంగానికి ఊతమిస్తూనే.. మరోవైపు పెట్టుబడుల కోసం ఎఫ్‌డీఐలను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం రక్షణ రంగంలో ఇప్పటివరకు 49శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 74కు పెంచింది. ఈ తరుణంలో ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ రంగంపై నమ్మకం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అత్యాధునిక సాంకేతికతతో కూడిన రక్షణ పరికరాలను రూపొందించేందుకు.. భారీ మొత్తంలో పెట్టుబడులు రాబట్టడం సవాలే. ఐపీ(ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ) హక్కుల సమస్యలూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కేవలం నోటి మాట ద్వారా సహాయం చేయకుండా.. అన్ని విధాలుగా సహాయం చేస్తేనే పోటీని తట్టుకుని రక్షణ పరిశ్రమలు ముందుకు సాగగలుగుతాయి.
అయితే.. 2015-2019 మధ్య రక్షణ రంగంలో భారత ఎగుమతులు 700శాతం పెరిగాయి. ఇది చాలు భారత దేశ శక్తిని చాటిచెప్పేందుకు. అందువల్ల.. 'రక్షణ'లో ఆత్మనిర్భరాన్ని సాధించడం.. హిమాలయ పర్వత అధిరోహణతో సమానం. కష్టమే కానీ.. అసాధ్యం కాదు!
(--- సంజీవ్ కుమార్ బారువా, సీనియర్ జర్నలిస్ట్)