పోలీసులు, మీడియా తనను వేధిస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రికి రాసిన లేఖలో మన్సుఖ్ హిరేన్ తెలిపారు. బాధితుడిగా ఉన్నప్పటికీ తనను నిందితుడిలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబానీ ఇంటి వద్ద నిలిపిన పేలుడు పదార్ధాల వాహన యజమాని హిరేన్ మన్సుఖ్ .
ఇదీ జరిగింది..
20 జిలెటిన్ స్టిక్స్తో దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం వద్ద ఫిబ్రవరి 25న ఓ స్కార్పియో కారు పార్కు చేసి ఉంచారు. అది ఐరోలీ-ములుంద్ బ్రిడ్జి వద్ద ఫిబ్రవరి 18న దొంగలించినదని పోలీసులు తెలిపారు. అయితే శుక్రవారం(మార్చి 5) అనుమానాస్పదంగా ఠానెలో హిరేన్ మృతిచెందారు. ఈ వ్యవహారాన్ని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) దర్యాప్తు చేస్తోంది.
లేఖలో ఏముందంటే..
ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, ఠానె, ముంబయి పోలీసు కమిషనర్లకు మార్చి 2న హిరేన్ రాసినట్లు ఉన్న లేఖ బయటకు వచ్చింది. అందులో పోలీసులు తనను వేధిస్తున్నారని చెప్పారు హిరేన్.
"నా కారు దొంగలించడమే కాక దుర్వినియోగం చేసిన దోషులతో నాకెలాంటి సంబంధం లేదు. అయినా నేను వేధింపులకు గురవుతున్నా. వాహనం ఎలా దొంగతనానికి గురైందో ముందే వివరించా. పోలీసులకు వాంగ్మూలమూ ఇచ్చాను. చేయని తప్పుకు పోలీసులు, వార్త రిపోర్టర్లు వేధిస్తున్నారు."
- లేఖలో హిరేన్
పలుధఫాలుగా ఫోన్లు చేసి తన కుటుంబసభ్యులనూ వేధించినట్లు మన్సుఖ్ వెల్లడించారు.
"ఫిబ్రవరి 25న అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనం లభించిందని పోలీసులు చెప్పారు. నన్ను విచారించి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 26న ఘట్కోపర్ పోలీసు అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఆ తర్వాత విఖ్రోలి పోలీసులు ప్రశ్నించి మరుసటి రోజు ఉదయం వరకు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 27 ఇంటి వద్ద వదిలేసిన తర్వాత ఈ రెండు ఠాణాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి."
-లేఖలో మన్సుఖ్ హిరేన్
మార్చి 1న ఉగ్రవాద నిరోధక బృందం ప్రశ్నించిందని లేఖలో హిరేన్ పేర్కొన్నారు. ఓ ముంబయి పోలీసు అధికారి కూడా అతడిని ప్రశ్నించినట్లు చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు, భమ్రే సంయుక్త పోలీసు కమిషనర్ తనని విచారించినట్లు చెప్పారు.
"వివిధ సంస్థల విచారణలతో మానసిక ప్రశాంతత కోల్పోయాను. బాధితునిగా ఉన్న నాతో నిందితుడిలా వ్యవహరిస్తున్నారు. మీడియా సంస్థలు పదేపదే ఫోన్లు చేసి నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నాయి." అని హిరేన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు రక్షణ కావాలని అధికారులను లేఖలో హిరేన్ కోరారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
నివేదిక రావాలి..
హిరేన్ కడుపులోని అవయవాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అయితే ఆ నివేదిక ఇంకా రాలేదని అధికారులు చెప్పారు.
ఇదీ చూడండి: 'మాన్సుఖ్ మృతి వెనుక నిజాల్ని తేల్చటం ఎంతో కీలకం'
ఇదీ చూడండి: 'అంబానీ ఇంటి వద్ద ఆ కారును పార్క్ చేసింది మేమే'