అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గువాహటిలోని శ్రీమంత శంకర్‌దేవా కళాక్షేత్రలో గవర్నర్ జగదీశ్ ముఖి.. హిమంతతో ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణం ఈ కార్యక్రమం జరగనుంది. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా నేడే ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే.. వారి పేర్లను ఇంకా ప్రకటించలేదు.
వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ గువాహటిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో హిమంతను భాజపా శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ పార్టీ నేతలు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సహా పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు.
భేటీ పూర్తయ్యాక నేరుగా రాజ్‌భవన్ వెళ్లి అసోం గవర్నర్ జగదీశ్ ముఖిని కలిశారు హిమంత. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు తనకు ఉందని భాజపా, ఏజీపీ, యూపీపీఎల్ ఎమ్మేల్యేలు సంతకాలు చేసిన లేఖను సమర్పించారు. అనంతరం హిమంతను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధానికి కృతజ్ఞతలు
అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న హిమంత బిశ్వశర్మ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్ వేదికగా ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. అసోంలో పాలన బాధ్యతలను తాను నెరవేర్చుతానని నమ్మినందుకు ధన్యుడినని పేర్కొన్నారు. ఇది తన జీవతంలో మర్చిపోలేని రోజు అని చెప్పారు. అసోం సహా ఈశాన్య రాష్ట్రాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే మోదీ దృక్పథానికి అనుగుణంగా తాను ముందుకు వెళ్తానని తెలిపారు. మరో ట్వీట్లో అసోం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.
126 స్థానాలు కలిగిన అసోం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని భాజపా 60 స్థానాలు, ఏజీపీ 9, యూపీపీఎల్ ఆరు సీట్లు గెలుపొందాయి.
ఇదీ చూడండి: సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే కరోనా