ఆయన పదహారేళ్ల వయసులోనే రెండు కళ్లూ కోల్పోయారు. అందరిలా తానూ తల్లడిల్లిపోయాడు. ఇక జీవితం ముగిసిపోయిందనుకున్న తరుణంలో.. ఆయనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పగలు, రాత్రికి తేడా తెలియని వేళ.. అంధత్వం అనే చీకట్లోనే తన జీవితానికి బాటలువేసుకున్నాడు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన త్రిలోచన్. స్వయంగా ఓ పిండి మిల్లును నడుపుతూ స్థానికుల మన్ననలు పొందుతున్నారు.
పిండి మిల్లు నిర్వహణ అంటే సాధారణంగానే కాస్త రిస్క్‌తో కూడుకున్న పని. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రమాదకరమే. అందులో అధిక ఓల్టేజీ విద్యుత్ మోటార్లు, పెద్ద పెద్ద మెషీన్లు అలా ఉంటాయ్ మరి. అయితే.. ఊనా ప్రాంతానికి చెందిన త్రిలోచన్ సింగ్ మాత్రం ఎవరి సహాయ సహకారాలు అక్కర్లేకుండానే.. అద్భుతంగా మిల్లును నడుపుతున్నారు. 62 ఏళ్ల వయసులోనూ సింగ్ పనిచేస్తున్న తీరు.. ఆ యంత్రాలతో ఆయనకున్న సమన్వయం చూసి స్థానిక ప్రజలు నివ్వెరపోతున్నారు.
లావాదేవీల్లోనూ..
తన మిల్లులో ఉండే నూర్పిడి యంత్రంతో బియ్యం, జొన్నలు, సజ్జలు, గోధుమలు వంటి ధాన్యాలతో పాటు సుగంధ ద్రవ్యాలనూ రుబ్బిస్తారు త్రిలోచన్. రెండు కళ్లు కనిపించకపోయినా.. లావాదేవీల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారని స్థానికులు చెప్పారు. 1980ల్లో కళ్లు కోల్పోయిన ఆయన.. 40ఏళ్లుగా ఇదే జీవితాన్ని సాగిస్తున్నారట. చిన్నపాటి ఓటములు, ప్రమాదాలు ఎదురవ్వగానే కుమిలిపోయే వారందెరికో ఆదర్శంగా నిలుస్తున్నారీ వృద్ధుడు.
ఇదీ చదవండి: ఆ గుడిలో మహాత్ముడికి నిత్యపూజలు!