HighCourt Rejects Stay on Group-3 and Group-4 Exams : రాష్ట్రంలో గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉద్యోగ నియామక ప్రక్రియలను ఆపలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.గ్రూప్ 3, 4నుంచి టైపిస్టు కమ్ అసిస్టెంట్ పోస్టులను తొలగించారంటూ 101 మంది ఉద్యోగార్థులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో 2015జీవో ప్రకారం గ్రూప్-3, గ్రూప్-4 ఉన్న టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉన్నాయని.. అయితే గతేడాది ఆ జీవోను సవరించినట్లు తెలిపారు.
కాబట్టి గతేడాది ఇచ్చిన 55, 136 జీవోలను కొట్టివేసి.. పాత ఉత్తర్వులను అమలు చేయాలని వారు హైకోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, టీఎస్పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 13కి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు స్టే ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది కోరగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. నియామక ప్రక్రియ ఆపడం కోర్టుల పనికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Group3 Notification 2023 : ఇటీవలే తెలంగాణ తొలి గ్రూప్-3 పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 1365 పోస్టులకు గానూ 5,36,477 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు జనవరి 24 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలుకాగా ఫిబ్రవరి 23 చివరి తేదీగా అధికారులు పేర్కొన్నారు. కానీ చివరి మూడు రోజుల్లో 90,147 మంది దరఖాస్తు చేశారు. చివరి 24 గంటల్లో 58,245 దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే గ్రూప్-3 పరీక్ష తేదీలను ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఒక్కోపోస్టుకు సగటున 116 మంది : మరోవైపు గ్రూప్-4 పరీక్షకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగుల సంఖ్య అధికం అవడం వలన పోటీ పడే నిష్పత్తి కూడా పెరిగింది. దీని వలన అభ్యర్థి ఉద్యోగం సంపాదించాలంటే తగిన కసరత్తు చేపట్టాలి. పోటీని దృష్టిలో పెట్టుకొని సన్నద్దం కావాలి. రాష్ట్రంలో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. మొత్తం 8,180 పోస్టుల కోసం 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 సర్వీసుల కింద రాష్ట్రంలో ఈ సారి 8,180 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.
రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు : 2018లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 700 వీఆర్‌వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఒక్కో పోస్టుకు సగటున 1511 మంది పోటీపడ్డారు. ఈ సంవత్సరం 8,180 గ్రూప్-4 పోస్టులకు 9,51,321 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.
Group-1 Preliminary Exam : మరోవైపు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇందుకు 994 పరీక్ష కేంద్రాలుఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 2,33,248 61.37శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. గతేడాది జరిగి, రద్దయిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది 79.15 శాతం హాజరుకాగా.. రెండోసారి నిర్వహించిన ఈ పరీక్షకు వారిలో దాదాపు 53,000 మంది హాజరుకాలేదని వారు వివరించారు.
ఇవీ చదవండి : GROUP-4: 8,180 ఉద్యోగాలు.. 9.5 లక్షల దరఖాస్తులు.. ఈ టిప్స్ పాటిస్తే విజేత మీరే