Hero Nikhil Advised Students Not To Use Drugs In Hyderabad : డ్రగ్స్‌కు అందరూ దూరంగా ఉండాలని.. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే.. అదే మరణమని హీరో నిఖిల్ హెచ్చరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన 'పరివర్తన' అవగాహన సదస్సులో సీపీఆనంద్, హీరో నిఖిల్, యువ నటుడు ప్రియదర్శి పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో వీరు మాట్లాడారు.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. చాలా సార్లు తనను డ్రగ్స్ తీసుకోమని చాలా మంది అడిగారని నిఖిల్ పేర్కొన్నారు. కానీ ఆ ఊబిలో దిగితే జీవితమే నాశనం అయిపోతుందని.. అలాంటి వాటికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే.. అదే మరణమని స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి ఆనందదాయకమైన జీవితం ఉందని.. అది వదిలేసి మిమ్మల్ని నాశనం చేసే డ్రగ్స్ వైపు వెళ్లకూడని చెప్పారు. పార్టీలకు, పబ్‌లకు వెళ్లిన సరదాగా ఎంజాయ్ చేసి.. వచ్చేయాలి తప్ప డ్రగ్స్ వైపు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అందరం కలసి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించుకుందామని.. తొందరలోనే ఆ మార్క్‌ను సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.
"ప్రస్తుత కాలంలో డ్రగ్స్ అనేది సమాజంలో పెద్ద సమస్యగా మారింది. అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణలో డ్రగ్స్ నివారణకు పిలుపునిచ్చారు. 26వ తేదీ అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే వరకు రాష్ట్రంలోని విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. యాంటీ నార్కోటిక్స్ కమిటీలను అన్ని కళాశాల్లోనూ ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం." -సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
Telangana Narcotic Bureau Started PARIVARTANA Program : మరోవైపు సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు. ఎంతో మంది విద్యార్థులు వాటికి బానిసలవుతున్నారని ఆవేదన చెందారు. ఒక్కసారి ఆ ఊబిలోకి విద్యార్థులు వెళితే.. అందులో నుంచి రావడం చాలా కష్టమని ఆఖరికి మరణమే తథ్యమని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్‌తో పట్టుబడితో.. కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకువచ్చామని విద్యార్థులకు తెలియజేశారు. ప్రస్తుతం డ్రగ్స్ అనేది సమాజంలో పెద్ద సమస్యగా మారిందని సీపీ ఆనంద్ తెలిపారు.
"డ్రగ్స్ వల్ల ఎందరో విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయి. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు వారు చేస్తున్న సేవలు అభినందనీయం. ఇప్పటి నుంచి తెలంగాణలో డ్రగ్స్ సరఫరా చేయాలంటే అందరూ వణికిపోయేలా ప్రత్యేక యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేశారు." -నిఖిల్ సిద్ధార్థ, యువ హీరో
PARIVARTANA Program For Students To Stop Using Drugs In Telangana : అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ నుంచి దేశానికి డ్రగ్స్ వస్తున్నాయని ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలు మారారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నార్కోటిక్స్, సైబర్ క్రైమ్‌లు ప్రధాన సమస్యలుగా మారాయని స్పష్టం చేశారు. ఈ పరివర్తన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పు రావాలని.. డ్రగ్స్ వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో తెలుసుకోవాలని సూచించారు. అనంతరం యువ హీరో ప్రియదర్శి మాట్లాడారు.
ఇవీ చదవండి :