అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లను.. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పట్టించుకోలేదు. గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా.. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గిరిజన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్లారు. కుట్రతో ఈడీ తనకు సమన్లు పంపిందని ఆరోపించారు సోరెన్. సమన్లు పంపే బదులు నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.
'నాకు భయం లేదు. ఆందోళన కూడా లేదు. రాష్ట్ర ప్రజలు తలుచుకుంటే ప్రత్యర్థులకు దాక్కోవడానికి చోటు కూడా దొరకదు' అని సోరెన్ అన్నారు. సోరెన్‌కు ఈడీ నోటీసుల నేపథ్యంలో కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా కుట్రలు చేస్తోందని సోరెన్ ఆరోపించారు.
నవంబరు 3న విచారణకు హాజరుకావాలని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆయినా ఆయన ఈడీ విచారణకు హాజరుకాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి వచ్చిన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, బర్హైత్, రాజ్‌మహల్, మీర్జా చౌకీతో పాటు బర్హర్వాలోని 19 ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, దోపిడీకి సంబంధించిన కేసులతో పంకజ్ మిశ్రాకు సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న ఈడీ.. జులై 8న మిశ్రాతో పాటు ఆయన సహచరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది.
ఇవీ చదవండి: ఆస్పత్రి నిర్లక్ష్యం.. నేలపైనే బాధితుడు.. కుక్క వచ్చి రక్తం నాకినా..
'స్మగ్లింగ్‌కు సీఎం అండ.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. గవర్నర్ సవాల్