Heavy rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో బయటకు వెళ్లిన నగరవాసులు, వాహనదారులు తడిసి ముద్దయ్యారు. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయి.. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మాదాపుర్ గచ్చిబౌలి కోండాపుర్ రాయదుర్గం ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మీయాపుర్-చందానగర్ ప్రాంతాల్లో ఊరుములు, ఈదురు గాలులతో కుండపోత వర్షం పడటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చందానగర్-ముంబయి జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి మార్గంలో లింగంపల్లి రైల్వే అండర్ పాస్ పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది. దీంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వేళ్లే వాహనాలను మియాపూర్ వైపు ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు.
అలాగే నగరంలోని బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్, పురాణపుల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, అడిక్‌మెట్, దోమలగూడ, కవాడిగూడ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో వరుణుడు విరుచుకుపడ్డాడు. మరోసారి వర్షం కురవచ్చునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు ఎవరు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. సహయం కోసం 040-29555500 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.
కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు: అలాగే రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. హనుమకొండలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడగా.. జనగామ జిల్లాలో వడగళ్ల వాన జిల్లావాసులను భయాందోళనలకు గురి చేసింది. ములుగు జిల్లాలో వర్షం పడి.. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ జిల్లాలోనే లింగాల గ్రామంలో పిడుగుపాటుకు 10 ఆవులు మృతి చెందాయి. భూపాలపల్లి జిల్లాలోని ఘనపూర్, రేగొండ, చిట్యాల, టేకుమట్లలో వర్షం కురిసింది.
ఇవీ చదవండి:
rain alert for telangana: బీ అలర్డ్... 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు
ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం.. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చి..