నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే ఏకైక ఎజెండాగా దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన మరో రూపు సంతరించుకుంటోంది. చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 19 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించిన రైతు సంఘాలు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. దానికి బదులుగా సోమవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపాయి.
సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపడతామని దిల్లీలో సమావేశమైన రైతు సంఘాల నేతలు తెలిపారు. దిల్లీలోని నిరసన ప్రాంతాల్లోనే ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో పాల్గొంటున్న అన్ని రైతు సంఘాలు కలిసే ఉన్నాయని స్పష్టం చేసిన నేతలు.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర చట్టం రద్దుపై కూడా తాము ఐక్యంగానే ఉన్నామన్నారు. ప్రభుత్వంతో చర్చల అంశంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
"మేం రైతు సంఘాల సమ్మతితో ఓ నిర్ణయం తీసుకున్నాం. 19వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను రద్దు చేశాం. సోమవారం మాత్రం దేశంలోని రైతు సంఘాలతో కలిసి ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతాం."
- గుర్నామ్‌సింగ్, రైతు సంఘ ప్రతినిధి
"ఈ ఆందోళన ఏ పార్టీకో, ఏ సంఘానికో చెందినది కాదు. ఇది గ్రామస్థాయిలోని రైతులు చేస్తున్న ఉద్యమం. అన్ని సంఘాలతో శాంతిపూర్వకంగా ఈ ఆందోళన ముందుకు సాగుతోంది. రైతుల వినతి మేరకు మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలి."
- రాకేశ్ టికైత్, రైతు సంఘ ప్రతినిధి
కేజ్రీవాల్ నిరహార దీక్ష
రైతులు తలపెట్టనున్న ఒక్కరోజు నిరాహార దీక్షకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. అన్నదాతలకు మద్దతుగా సోమవారం తానూ ఉపవాస దీక్ష చేయనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆమ్ ఆద్మీ కార్యకర్తలూ.. అన్నదాతలకు మద్దతుగా ఉపవాసం చేయాలని కోరారు. కొందరు భాజపా నేతలు రైతులను కావాలనే జాతివిద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. 'కర్షకులకు క్రీడాకారులు, కళాకారులు, ప్రముఖులు మద్దతిస్తున్నారు. వాళ్లూ వీళ్లు కూడా జాతి విద్రోహులేనా?' అని ప్రశ్నించారు కేజ్రీవాల్.
"ఆందోళన చేస్తున్న తమకు మద్దతుగా దేశ ప్రజలందరూ ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని కర్షకులు పిలుపునిచ్చారు. సోమవారం వారి వారి ఇళ్లల్లో ఒకరోజు ఉపవాసం చేయాలని, రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రార్థనలు చేయాలని నేను దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేనూ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాను. రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అహంకారాన్ని వీడి మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలి. కనీస మద్దతు ధర కోసం ఎంఎస్‌పీ గ్యారంటీ బిల్లును తీసుకురావాలి."
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం
సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో 18రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు ఆదివారం కూడా దాన్ని కొనసాగించాయి. రాజస్థాన్‌లోని షాజహాన్‌పుర్‌కు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చిన రైతులు.. దిల్లీకి ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. దాదాపు 120 కిలోమీటర్ల మేర ఈ మార్చ్ జరిగింది. స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్, సామాజిక వేత్త మేథా పాట్కర్ రైతుల ఆందోళనల్లో పాల్గొని.. వారికి మద్దతు ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ నుంచి వేలాది మంది రైతులు దిల్లీకి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అన్నదాతల ఆందోళనతో దిల్లీ- జయపుర జాతీయ రహదారికి ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి.
భారీగా మద్దతు
దిల్లీ రైతు పోరాటానికి మద్దతు మరింత పెరుగుతోంది. రైతులకు సంఘీభావంగా దిల్లీలోని జంతర్ మంతర్‌లో పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ మద్దతు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చించాలని శశిథరూర్ విజ్ఞప్తి చేశారు. నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులకు మద్దతుగా పంజాబ్ జైళ్ల డీఐజీ లక్మీందర్ సింగ్ జఖర్ రాజీనామా చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నూతన దంపతులు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాదయాత్ర చేశారు. కర్షకులకు మద్దతుగా మాజీ సైనిక అధికారులు తమ పతకాలను తిరిగి ఇచ్చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి రైతులు దేశ రాజధానికి తరలివస్తుండటం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుంటున్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
వ్యతిరేకించడమే విపక్షాల స్వభావం
రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రతిపక్షాలే లక్ష్యంగా విమర్శలు కురిపించారు. వ్యతిరేకించడం వారి స్వభావంగా మారిందని ధ్వజమెత్తారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ చట్టాలు "స్వల్పకాలంలో కొంతమందికి ఇబ్బందులు కలిగించవచ్చు. కానీ దీర్ఘకాలంలో రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయి" అని తోమర్ అన్నారు.
చట్టాలకు ఉత్తరాఖండ్ రైతుల మద్దతు
ఉత్తరాఖండ్‌కు చెందిన రైతులు దిల్లీలో తోమర్‌ను కలిశారు. మూడు వ్యవసాయ చట్టాలను తాము సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టాలను అర్థం చేసుకుని, మద్దతిచ్చే ఉత్తరాఖండ్ రైతు సంఘాలకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు తోమర్. మూడు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసనలు చేపడుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: రైతు నిరసనలపై షాతో మంత్రుల భేటీ