ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసులో.. దోషికి ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సందీప్ సింగ్(20)కు జీవిత ఖైదు విధించింది. రూ.50వేల జరిమానా సైతం చెల్లించాలని ఆదేశించింది. ఐపీసీ, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 304 ప్రకారం సందీప్‌ను దోషిగా నిర్ధరించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి, రాము, లవ్కుశ్ను నిర్దోషులుగా ప్రకటించింది. గురువారం కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై తాము హైకోర్టుకు వెళ్తామన్నారు. "సందీప్‌పై అత్యాచార ఆరోపణలు రుజువు కాలేదు. ఈ తీర్పు కేవలం హత్యకు సంబంధించినదే. అతడు అమాయకడు. దీనిపై మేము హైకోర్టుకు వెళతాం." అని సందీప్ తరపు న్యాయవాది మున్నా సింగ్ అన్నారు.
కేసు వివరాలు..
సెప్టెంబర్ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని తొలుత యూపీ అలీగఢ్‌లోని జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ యువతి చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించింది.
అనంతరం బాధితురాలి అంత్యక్రియలను పోలీసులు బలవంతంగా నిర్వహించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరణించిన రోజే హుటాహుటిన భౌతిక కాయాన్ని దిల్లీ నుంచి యూపీ తరలించి, తెల్లవారుజామున 3 గంటల సమయంలో కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు. అంత్యక్రియలను బంధువుల సమక్షంలో నిర్వహిస్తామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదన్నారు. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతితోనే కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. హత్రాస్ జిల్లా కలెక్టర్ సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. తొలుత సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. అనంతరం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. దీంతో ఈ కేసు విచారణ సీబీఐ చేతికి చేరింది. ఇదే సమయంలో బాధితులకు సరైన న్యాయం జరగదని, విచారణను బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన సుప్రీం కోర్టు.. అలహాబాద్ హైకోర్టు ముందు సీబీఐ స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి.