Cough syrup: దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాతపడటం తీవ్ర సంచలనం సృష్టించింది. హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరియాణా ఔషధ నియంత్రణ సంస్థ చర్యలు ప్రారంభించింది. చిన్నారుల మృతికి కారణమైన మందుల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేయాలని డ్రగ్ కంట్రోల్ బుదవారం ఆదేశాలు జారీచేసింది. తనిఖీల సమయంలో అధికారులు లోపాలు గుర్తించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
తనిఖీల సమయంలో సొనెపట్‌లోని మైడెన్‌కు చెందిన దగ్గుమందు తయారీ కేంద్రంలోని లోపాలను హరియాణా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంస్థకు చెందిన తయారీ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని దానిలో పేర్కొంది. ఈ నోటీసులపై మైడెన్ నవంబర్ 14లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిన ఈ ఔషధాలను పరీక్ష నిమిత్తం కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్‌కు పంపించాం. ఆ ఫలితాలు ఇంకా రాలేదు. వాటిని బట్టి చర్యలు తీసుకుంటాం. అయితే తనిఖీల్లో 12 లోపాలు బయటపడ్డాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించాం. షోకాజు నోటీసులు జారీ చేశాం అని హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు
దగ్గు మందు తయారీ, టెస్టింగ్‌కు సంబంధించిన పరికరాల లాగ్‌బుక్‌లను నిర్వహించడంలో విఫలమైందని, ప్రొపైలిన్ గ్లైకాల్, సార్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్‌పరాబెన్ బ్యాచ్ నంబర్ల వివరాలు లేవంటూ పలు ఉల్లంఘనలను గుర్తించింది. తయారీ ప్రక్రియలో పరీక్షలకు సంబంధించిన వివరాలూ ఇవ్వనట్లు తేలింది. ఈ మందులు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గతంలోనే నాలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోపక్క 2011లో వియత్నాం ఈ సంస్థపై నిషేధం విధించింది.
హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే గాంబియాలో సెప్టెంబరులో చిన్నారుల మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. పలువురు చిన్నారుల్లో కిడ్నీలు దెబ్బతినడానికీ ఇవే కారణమని తెలిపింది. ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్‌మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌లుగా వీటిని పేర్కొంది. ఈ మందుల సరఫరా, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.
ఈ సిరప్‌లను ప్రయోగశాలల్లో పరీక్షించగా.. ప్రమాదకర స్థాయుల్లో డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు పేర్కొంది. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన దగ్గు, జలుబు సిరప్‌లు ఎగుమతికి మాత్రమే అనుమతి పొందాయని, వాటిని భారత్‌లో విక్రయించడానికి, మార్కెటింగ్ చేయడానికి వీల్లేదని ఈ ఘటన అనంతరం హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా? వెంటనే ఈ పని చేయండి!
స్వదేశీ ఆయుధాలపై భారత్ ప్రత్యేక దృష్టి.. ఇక శత్రుదేశాలకు చుక్కలే!