Harish Rawat rebel: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్.. పార్టీ తీరుపై నేరుగానే ప్రశ్నించి కేంద్ర నాయకత్వం వెన్నులో వణుకు పుట్టించారు. పార్టీ వైఖరిని విమర్శిస్తూ బుధవారం వరుస ట్వీట్లు చేసి.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఎన్నికలు అనే సముద్రంలో ఈదాల్సి ఉందని, అయితే చాలా చోట్ల పార్టీ మద్దతు తెలపాల్సింది పోయి.. వెన్నుచూపి నెగెటివ్ రోల్ పోషిస్తోందని విమర్శించారు.
"అధికార పార్టీ చాలా మొసళ్లను సముద్రంలో వదిలింది. ఇప్పుడు.. నేను ఎవరినైతే అనుసరించాలో.. వారి అనుచరులే నా చేతులు, కాళ్లు కట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందనే ఆలోచనలతో నిండిపోయాను. నువ్వు చాలా కాలం ఈదుకొచ్చావు, ఇక చాలు హరీశ్ రావత్ అని నాలోని ఓ స్వరం చెబుతోంది. నేను సందిగ్ధంలో ఉన్నాను. నూతన సంవత్సరం నాకు మార్గాన్ని చూపుతుంది. ఈ పరిస్థితుల్లో కేదార్నాథుడు నాకు మార్గనిర్దేశం చేస్తాడనే నమ్మకం ఉంది."
- హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి.
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో తనను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపకపోవటంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు రావత్. తాను బలహీనుడిని, సవాళ్ల నుంచి పారిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. పార్టీ వైఖరి పట్ల హరీశ్ రావత్ సంతోషంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తులో.. కాంగ్రెస్‌ను వీడే ఆలోచన చేసే అవకాశాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంది.
ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో రావత్ తీరు ఇలాగే కొనసాగితే.. పార్టీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హరీశ్ రావత్‌కు ప్రత్యామ్నాయం లేదు..
రావత్ ట్వీట్లపై ఆయన మీడియా సలహాదారు సురేంద్ర కుమార్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ఉత్తరాఖండ్‌లో పార్టీ అవకాశాలను దెబ్బతీసేందుకు సొంత పార్టీలోని కొన్ని శక్తులు భాజపా చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు.
" ఉత్తరాఖండ్‌లో హరీశ్ రావత్‌కు ప్రత్యామ్నాయం లేదు. రాష్ట్రంలో ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నేత. కానీ, కొన్ని శక్తులు భాజపా చేతిలోకి వెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. దేవేంద్ర యాదవ్ మా ఇంఛార్జి. ఆయన పార్టీ కార్యకర్తల చేతులు కట్టేసేందుకు ప్రయత్నిస్తే.. అది పార్టీ ఎన్నికల ఫలితాలనే దెబ్బతీస్తుంది. హైకమాండ్ దీనిని దృష్టిలో పెట్టుకోవాలి."
- సురేంద్ర కుమార్, రావత్ మీడియా సలహాదారు.
రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జిగా ఉన్న దేవేంద్ర యాదవ్‌కు రావత్‌తో విభేదాలు ఉన్న నేపథ్యంలో విలేకరులు ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు. మరోవైపు.. హరీశ్ రావత్ నాయకత్వంలోనే 2022 ఎన్నికలు జరుగుతాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
" హరీశ్ రావత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాహుల్ గాంధీ ర్యాలీలో దేవేంద్ర యాదవ్ ఉన్నప్పుడు ఆయన పోస్టర్లు తీసేస్తే.. ఆయనపై అనుమానాలు వస్తాయి. ఈ కుట్రలో దేవేంద్ర యాదవ్ ఉండే అవకాశం ఉంది."
- సురిందర్ అగర్వాల్, హరిశ్ రావత్ సలహాదారు.
ఏదో విషయం ఉంటుంది..
కాంగ్రెస్‌లో హరీశ్ రావత్ సీనియర్ నాయకుడని పేర్కొన్నారు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్. ఆయన ఏదైనా చెబితే అందులో ఏదో ఒక అంశం ఉంటుదని, పార్టీలో కొందరు తనను అణచివేయాలని చెప్పినప్పుడు ఆయన పడుతున్న బాధను సూచిస్తోందన్నారు. ఆయన మద్దతు లేకపోతే.. ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు? అని ప్రశ్నించారు. అది భాజపాకే మేలు చేస్తుందని తెలిపారు.
సమయం వచ్చినప్పుడు మాట్లాడతా: రావత్
ఉత్తరాఖండ్ ఎన్నికలకు వెళ్లే ముందు తన చేతులు కట్టేశారని కాంగ్రెస్ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శిస్తూ చేసిన ట్వీట్లపై మాట్లాడేందుకు నిరాకరించారు హరీశ్ రావత్. సమయం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తానని చెప్పారు. ' సమయం వచ్చినప్పుడు నేనే మీకు(మీడియా) కాల్ చేసి అన్నీ తెలియజేస్తాను. ఇప్పుడు ఇది ఎంజాయ్ చేయండి' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: