ఐపీఎస్ అధికారినంటూ మాయమాటలు చెప్పి గర్ల్‌ఫ్రెండ్‌ను నమ్మించాడు ఓ యువకుడు. అంతేకాక పోలీసులనూ బెదిరించబోయి.. చివరకు వారి చేతికే చిక్కాడు.
ఏం జరిగిందంటే..?
ముంబయి ఠాణెకు చెందిన సాగర్ వాగ్మరే(28).. తాను ఐపీఎస్ అధికారినంటూ ప్రేయసిని నమ్మించాడు. రెండురోజుల క్రితం గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వచ్చాడు. తాను 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారినంటూ స్థానిక పోలీసులకు చెప్పాడు. తమకు నగరంలోని ఓ హోటల్లో గదిని బుక్ చేయాలని ఆదేశించాడు. సాగర్ ప్రవర్తనపై అనుమానం కలిగిన సదరు పోలీసులు.. అతడి గురించి ఆరా తీశారు.
2018 బ్యాచ్‌లో సాగర్ పేరుతో ఐపీఎస్ అధికారి లేకపోవటం వల్ల.. అతడు మాయచేస్తున్నాడని నిర్ధరించుకున్నారు. దీంతో నిందితుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి జిల్లా ఎస్పీ యోగేంద్ర రావత్ ఆధ్వర్యంలో.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు సంగతి బయటపడింది.
పోలీసులు వివిధ సెక్షన్ల కింద సాగర్‌పై కేసు పెట్టి, అరెస్ట్ చేశారు.
మరో ఘటన..
ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఐపీఎస్ అధికారిగా నమ్మిస్తూ.. పలు మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక కార్యదళం అరెస్ట్ చేసింది.
ఇదీ చూడండి: ట్రాన్స్ఉమన్తో యువకుడి పెళ్లి.. తల్లిదండ్రులు నో చెప్పినా...