Mercy Killing in Madikeri: కారుణ్య మరణానికి అనుమతించాలని ఓ వ్యక్తి, తన కుటుంబంతో కలిసి రాష్ట్రపతిని అభ్యర్థించాడు. తన యజమాని తీవ్రంగా వేధిస్తున్నాడని పిటిషన్లో తెలిపాడు. కర్ణాటక కొడగు జిల్లాలో జరిగిందీ ఘటన.
బయటకు వెళ్లకుండా చేసేందుకు.. మడికేరి పలిబెట్టలోని తన ఇంటిచుట్టూ 15 అడుగుల మేర గొయ్యి తవ్వించాడని ఆరోపించాడు. నిచ్చెన సాయంతో ఇంట్లోకి వెళ్లాల్సి వస్తుందని వాపోయాడు.
ఇదీ జరిగింది..
మడికేరిలో అన్నామలై అనే వ్యక్తికి 250 ఎకరాల మేర పంటపొలాలు, తోటలు ఉన్నాయి. అందులోనే 25 సంవత్సరాలుగా డ్రైవర్‌గా చేస్తున్నాడు సుబ్రమణి. నివసించేందుకు యజమాని.. అక్కడే ఓ భవనం కూడా ఇచ్చాడు. ఇటీవల ఇద్దరి మధ్య ఆర్థిక తగాదాలతో.. సుబ్రమణిని క్వార్టర్స్ ఖాళీ చేయాలని చెప్పాడు అన్నామలై. తనకు రావాల్సిన రూ. 12 లక్షలు ఇస్తేనే వెళ్తానని బదులిచ్చాడు సుబ్రమణి. ఆగ్రహానికి గురైన అన్నామలై.. జేసీబీతో అతని ఇంటిచుట్టూ గొయ్యి తవ్వించాడు. కరెంట్, వాటర్ కనెక్షన్ కట్ చేశాడు.
దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుబ్రమణి కుటుంబం.. స్థానిక విరాజ్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. అయినప్పటికీ.. యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని కారుణ్య మరణం కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నాడు.
''ఎస్టేట్‌లో 25 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నా. 2016లో కారణం లేకుండానే.. యజమాని నన్ను, నా కూతుర్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. చెన్నైలో ఉండే తన తల్లిని కలవాలని చెప్పాడు. అక్కడికి వెళ్తే.. బాధ్యతలన్నీ తన కుమారుడికే అప్పగించానని చెప్పింది. మళ్లీ వచ్చి యజమానితో మాట్లాడితే ఇబ్బందులు పెట్టాడు. ఇంటిచుట్టూ 15 అడుగుల గొయ్యి తవ్వించాడు. రోజూ నిచ్చెనతో ఇంటికి వెళ్లడం కష్టంగా ఉంది. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ప్రభుత్వం స్పందించకుంటే ఏదో ఒకటి చేసుకుంటాం.''
- సుబ్రమణి, డ్రైవర్
ఇవీ చూడండి: ఒకప్పటి కార్పెంటర్.. ఇప్పుడు ఎమ్మెల్యే- పంక్చర్ మెకానిక్‌గా కుమారుడు