దిల్లీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూను క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించారు. తాను దురుద్దేశంతో ఎర్రకోటకు వెళ్లలేదని.. అందరిలానే ఏమైందో చూద్దామని అక్కడికి వెళ్లినట్టు వివరించాడు.
'అక్కడే ఉన్నా కానీ నిద్రపోయా..'
జనవరి 25న తాను సింఘూ సరిహద్దులో లేనని మొదట సిద్ధూ పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులు ఆధారాలు చూపటంతో తాను అక్కడకు వెళ్లానని కానీ నిద్రపోయానని తెలిపాడు. జనవరి 26న తాను నిద్ర లేచే సరికి రైతులు ఎర్రకోట వైపునకు వస్తున్నారని మెసేజెస్ రెండు, మూడు మిస్సెడ్ కాల్స్ వచ్చాయన్నాడు. తన స్నేహితులతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎర్రకోట వద్దకు వచ్చామని తెలిపాడు. అక్కడ ఉద్రిక్తతలు చెలరేగటం వల్ల వెళ్లిపోయామన్నాడు.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా గతనెల 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా ఎర్రకోట వద్ద నిరసనకారులు బీభత్సం సృష్టించారు. దీనికి సూత్రదారి దీప్ సిద్ధూ అని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధూను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. 7 రోజుల కస్టడీని విధించింది దిల్లీ కోర్టు.
ఇదీ చూడండి: సొరంగంలోని వారి కోసం జోరుగా సహాయక చర్యలు