ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రం గుజరాత్‌లోని సూరత్‌లో సిద్ధం కానుంది. మరో ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ డైమండ్ క్రయ విక్రయాలు, వేలం జరుగుతాయి. పాలిష్(మెరుగు పెట్టిన) చేసిన డైమండ్లను ఎగుమతులు చేస్తారు. ఈ వజ్రాల మార్కెట్ కేంద్రంగా.. 175 దేశాల నుంచి దాదాపు రూ. 2 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
శుద్ధి చేసిన నీరు సహా సౌర శక్తి వాడకంతో పర్యావరణ హితంగా.. ఈ డైమండ్ బోర్స్‌ను నిర్మిస్తున్నారు. అందుకే.. దీనిని గ్రీన్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తున్నారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4 వేల మంది వ్యాపారులు ఈ ప్రాజెక్టు రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రపంచంలోనే ఎద్దరో పేరుమోసిన వజ్రాల వ్యాపారులు ఈ మార్కెట్ ప్రారంభం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
గుజరాత్ ప్రభుత్వం.. ఈ సూరత్ డైమండ్ బోర్స్ కమిటీకి 36 ఎకరాల భూమి కేటాయించి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లబ్ధి పొందడం సహా.. గుజరాత్లో వజ్రాల వ్యాపారాన్ని విస్తరించడమే దీని లక్ష్యం.
9 టవర్లు.. 4500 కార్యాలయాలు..
అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సదుపాయాలతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. మొత్తం 20 ఫ్లోర్ల చొప్పున 9 టవర్లలో 4500 కార్యాలయాలు ఉంటాయి. ఇది ముంబయిలోని భారత్ డైమండ్ బోర్స్ కంటే 4 రెట్లు ఎక్కువ. పంచతత్వ అనే ఇతివృత్తంతో దీనిని నిర్మిస్తున్నారు.
ప్రధాన ద్వారం నుంచి కేవలం 5 నిమిషాల్లోనే అక్కడి ఏ కార్యాలయానికైనా చేరుకోవచ్చు. మొత్తం 128 లిఫ్ట్‌లు ఉండగా.. 18 సెకండ్లలోనే 16వ ఫ్లోర్‌కు చేరుకొనే వేగం దీని ప్రత్యేకత.
ప్రాజెక్టు ప్రత్యేకతలు..
- ప్రాజెక్టు వ్యయం రూ. 2,500 కోట్లు
- పెట్టుబడులు- 1.25 లక్షల కోట్లు
- 46 వేల టన్నుల స్టీలు(ఉక్కు) వాడకం
- ఒకే ప్రాంతం నుంచి డైమండ్, పాలిష్డ్ డైమండ్ క్రయవిక్రయాలు
- సూరత్‌కు రూ. 2 లక్షల కోట్లకుపైగా వ్యాపారం
- అత్యున్నత అగ్నిమాపక సదుపాయాలు
- 400 కె.వి. సోలార్‌తో భవనాల పైకప్పు
- 1.8 ఎంఎల్డీ నీటి శుద్ధి కర్మాగారం
సూరత్ వజ్రాల ఉత్పత్తి, తయారీకి కేంద్రంగా ఉన్నప్పటికీ.. ముంబయి వ్యాపార కేంద్రంగా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు. సూరత్‌లో ఈ వజ్రాల మార్కెట్ ప్రారంభమైతే.. స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ముంబయిలో వ్యాపారం చేయలేని వారు, ఇంకా చిన్న పరిశ్రమల వారికి ఇదెంతో ప్రయోజనమని చెబుతున్నారు.
మోదీ చేతుల మీదుగా..
ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిపేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగానే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని, ఆరు నెలల్లో అంటే దీపావళి నాటికి సిద్దం అవుతుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాను జయించిన 9 నెలల తర్వాతే టీకా!