విలాసాలకు అలవాటు పడిన ఓ మహిళ.. ఖర్చుల కోసం తన అండాన్ని అమ్ముకుంది. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రైవాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనిపై మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 జనవరి నుంచి 2022 జూన్ మధ్య అనేక సార్లు ఆమె తన అండాన్ని విక్రయించిందని భర్త ఆరోపించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ కణాలను విక్రయించిందని, ఇందుకు ఆమె తల్లి కూడా సహకరించిందని చెప్పారు. విలాసాలకు అయ్యే ఖర్చులను భరించేందుకే అక్రమంగా ఇలా చేస్తున్నారని తెలిపారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. నిందితురాలు అనిత.. ఆధార్ కార్డులో తన పుట్టినతేదీ మార్చుకొని అండాలను విక్రయించింది. భర్త అనుమతి తీసుకొనే అండాన్ని విక్రయిస్తున్నానని చెప్పింది. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసింది. కానీ, ఆమె భర్త ఒక్కసారి కూడా ఆస్పత్రికి వెళ్లలేదు.
ఈ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే, రెండేళ్లుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మహిళ.. తన అత్తమామలతో గొడవలు పడుతోంది. వారి నుంచి దూరంగా ఉండాలని భర్తను కోరింది. ఇందుకు సరేనన్న ఆమె భర్త.. అద్దె గదిలో కాపురం పెట్టాడు. అయితే, భర్త ఆదాయం సరిపోవడం లేదని భార్య మళ్లీ గొడవలు మొదలుపెట్టింది. దీంతో విసుగుచెంది ఆమెను దూరంపెట్టాడు ఆ వ్యక్తి. 2019లో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. దీనిపై అనిత.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భరణం ఇప్పించాలని కోరింది. అయితే, ఇటీవల ఇరువురి మధ్య సయోధ్య కుదిరి మళ్లీ కలిసి జీవించడం స్టార్ట్ చేశారు. అప్పుడే.. అండాలు విక్రయించిన విషయం అనిత భర్తకు తెలిసింది.
చంపుతామని బెదిరించి..
అహ్మదాబాద్‌లోని ఓ ఏజెంట్‌ను పరిచయం చేసుకొని.. అతడి ద్వారా అండాలను విక్రయించిందని గుర్తించాడు. వెంటనే ఆమెను ప్రశ్నించాడు. గట్టిగా అడిగేసరికి అనిత.. తన భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లిని పిలిచి గొడవ పెట్టుకుంది. ఈ విషయాన్ని సాగదీసినా.. పోలీసులకు చెప్పినా చంపేస్తానని తన తల్లితో కలిసి బెదిరింపులకు గురిచేసింది. దీనిపై పోలీసులు ఫోర్జరీ, నేరానికి పాల్పడటం వంటి రెండు కేసులు నమోదు చేసుకున్నారు.