దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఇంధన ధరలను సామాన్యుడు భరించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారంగా అతి తక్కువ ధరకే సోలార్ సైకిల్‌ను తయారు చేశాడో బాలుడు. గుజరాత్ వడోదర జిల్లాకు చెందిన ఈ విద్యార్థి వినూత్న ఆలోచనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. పనికిరాని సైకిల్‌తో.. సోలార్ సైకిల్‌ను తయారుచేశాడు జెనిత్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న నీల్ షా. వ్యర్థాలతో రూపొందించిన ఈ సైకిల్.. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నాడు. తనకు మొదటి నుంచి సైన్స్ సబ్జెక్ట్‌పై చాలా ఆసక్తి అని అంటున్న నీల్ షా.. తన గురువు ఇచ్చిన ఓ ప్రాజెక్టులో భాగంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నాడు.
"ఇంధన ధరలు పెరుగుతున్నందున సోలార్ సైకిల్‌ను తయారు చేయమని మా సార్ సూచించారు. దీనిపై నా సొంత పరిశోధన చేయడం ప్రారంభించాను. ఈ ప్రాజెక్ట్ కోసం నాకో సైకిల్ అవసరమైంది. కానీ నా ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున.. రూ.300కు ఓ పాత సైకిల్ కొన్నా. అలా ఈ సైకిల్‌ను తయారు చేశాను."
---నీల్ షా, 12వ తరగతి విద్యార్థి
సోలార్ సైకిల్ తయారీపై అవగాహన కోసం సైకిల్ మెకానిక్‌ని కలిసి కొన్ని సలహాలు తీసుకున్నట్లు నీల్ షా వివరించాడు.
"సోలార్ సైకిల్ తయారీ గురించి తెలుసుకుని మా గురువుగారు ఆశ్చర్యపోయారు. ఈ సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 15 కిమీ వరకు నడుస్తుంది."
---నీల్ షా, 12వ తరగతి విద్యార్థి
తన విద్యార్థి సోలార్ సైకిల్ తయారుచేయడం చాలా ఆనందంగా ఉందని నీల్ షా గురువు సంతోష్ కౌశిక్ తెలిపారు. సైన్స్ సబ్జెక్టు, పరిశోధనల పట్ల అతనికి గల అంకితభావం గురించి వివరించారు.
"నీల్ 10వ తరగతిలో ఉన్నప్పుడే పరిశోధనలకు సంబంధించి క్లిష్టమైన ప్రశ్నలు అడిగేవాడు. నేను అతని ప్రతిభను గుర్తించి.. 12వ తరగతిలో సోలార్ సైకిల్‌ను రూపొందించాలనే ఛాలెంజ్ ఇచ్చా. నా సవాల్‌ను స్వీకరించి.. చాలా బాగా పూర్తి చేశాడు."
---సంతోష్ కౌశిక్, నీల్ షా ఉపాధ్యాయుడు
ఇలాంటి విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి.. సరైన ప్రోత్సాహం ఇస్తే.. మరిన్ని ఆవిష్కరణలు చేయగలరని సంతోష్ కౌశిక్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: