Woman forestgourds in surat mandvi: గుజరాత్‌లోని సూరత్ పట్టణానికి సమీపంలో మాండ్వీ అటవీ రేంజ్ పరిధిలో దాదాపు 2వేల 5 వందల హెక్టార్‌ల విస్తీర్ణం గల అటవీ ప్రాంతాన్ని ఖోడాంబ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. క్రూరమృగాలకు ఆవాసమైన ఈ ప్రాంతం రక్షణ కోసం గుజరాత్ అటవీ శాఖ ఏడుగురు మహిళా అధికారులను నియమించింది. ఎటువంటి ఆయుధాలు లేకుండా ఇంత పెద్ద అడవిలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఈ మహిళా అధికారులు నేర్పరితనంతో అధిగమిస్తున్నారు. స్మగ్లర్ల బెదిరింపులకు లొంగకుండా వారి బారి నుంచి అడవిని కాపాడతున్నారు. ఒత్తిడి, ఆందోళనను తమ దరిచేరనీయకుండా వృత్తిలో రాణిస్తున్నారు.
దాదాపు ఎనిమిది సంవత్సరాల కిందట విధుల్లో చేరిన ఈ మహిళ అధికారులంతా అటవీ సంరక్షణలో తలమునకలయ్యారు.అడవిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం వీరంతా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమీప గ్రామాల్లో పులులు, ఇతర క్రూరమృగాలు సంచరిస్తున్నట్లు సమాచారం అందితే వాటిని బంధించేందుకు మహిళాలే రంగంలోకి దిగుతున్నారు. ఎంతో బరువుతో కూడిన ప్రత్యేకబోనులను అడవిలోకి తీసుకెళ్లి, ధైర్యంగా వాటినిబంధించి అడవిలో వదులుతున్నారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అడవిలో గాయాలపాలైన జంతువులను సంరక్షించి వాటికి వైద్యం చేయిస్తున్నారు. చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకున్నా మనోధైర్యంతో ముందుకు సాగుతూ అడవితల్లిని సంరక్షిస్తున్నారు.
మగవారికి దీటుగా ఈ మహిళా అధికారులు విధుల్లో భాగంగా ద్విచక్రవాహానాలపైనే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 2వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలోని ఈ అభయారణ్యంలో బెరుకు, భయం లేకుండా రాత్రిళ్లు కూడా విధులు నిర్వర్తిసారు. స్మగ్లర్ల భారీ నుంచి అటవీ సంపదను కాపాడుతున్నారు. అడవుల రక్షణలో భాగంగా ఆదివాసీ గ్రామాల ప్రజలకు అటవీ హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టినట్లు మహిళా అధికారులు తెలిపారు. 15 రోజులకోసారి సమీప గ్రామాలకు వెళ్లి గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.దీంతో అడవిలో వృక్షాల నరికివేత క్రమంగా తగ్గిందన్నారు.
మరోవైపు అటవీవిస్తీర్ణాన్ని పెంచేందుకు కూడా ఈమహిళా అధికారులు కృషి చేస్తున్నారు. అడవిలో ఖాళీ ప్రదేశాల్లో ప్రతిరోజూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించినట్లు తెలిపారు. అడవి తల్లి పరిరక్షణలో భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు. భవిష్యత్తులోనూ ఈ అడవికి తామే రక్షకులుగా ఉంటామని ఈ వీర వనితలు ధైర్యంగా చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'కొవిడ్ బాధిత కుటుంబాలను పెద్ద మనసుతో ఆదుకోండి'