Gujarat food poisoning: గుజరాత్‌లోని మహేసాణా జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో.. విందు ఆరగించి అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారాన్ని స్వీకరించడం వల్ల 1,200 మందికిపైగా అతిథులు అనారోగ్యానికి గురయ్యారని పోలీసులు తెలిపారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని చెప్పారు.
విస్నగర్ తాలుకాలోని సవాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడి వివాహానికి చాలా మంది హాజరయ్యారని పోలీసులు తెలిపారు. శాఖాహారంతో పాటు మాంసాహారం సైతం సరఫరా చేశారని చెప్పారు.
'వివాహ విందును ఆరగించిన తర్వాత 1,200 మందికి పైగా జబ్బు పడ్డారు. చాలా మంది వాంతులు చేసుకున్నారు. డయేరియా వంటి సమస్యలు తలెత్తాయి. వీరందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించాం' అని మహేసాణా ఎస్పీ పార్థరాజ్సిన్హ్ గోహిల్ వెల్లడించారు. కార్యక్రమంలో సరఫరా చేసిన ఆహారం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఫుడ్ అండ్ డ్రగ్ శాఖ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టిందని చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.
ఇదీ చదవండి: ఎన్నికల వేళ.. భాజపా బహిష్కృత నేత ఇంటి వద్ద పేలుడు