Gujarat Election 2022 : ప్రతిసారీ భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోటీగా ఉండే గుజరాత్ ఎన్నికలు ఈసారి ఆమ్ ఆద్మీపార్టీ బలంగా అడుగు పెట్టడంతో త్రిముఖంగా మారాయి. 2017 ఎన్నికల్లోనూ పాల్గొన్నా.. అప్పుడు డిపాజిట్లు కూడా దక్కని 'ఆప్' ఐదేళ్లలో బలం పుంజుకుంది. పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి భాజపా తర్వాత స్థానాల్లో నిల్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈసారి బలమైన శక్తిగా ఎదుగుతామని సంకేతాలిస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచీ గుజరాత్‌లో కాంగ్రెస్, భాజపాలు తప్పిస్తే మరో పార్టీకి (ఒకసారి జనతాదళ్ వచ్చినా అదీ భాజపా మద్దతుతోనే.. స్వల్పకాలమే) అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో.. దిల్లీ నుంచి కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ దూసుకు వస్తుండటం భాజపా, కాంగ్రెస్‌లకు కొరుకుడు పడని అంశం! దిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తన సత్తా నిరూపించుకుంది. ఆకర్షణీయమైన హామీలు, పాలనతో ప్రజలను ఆకట్టుకుంది. ఆ ఊపుతోనే గుజరాత్‌పైనా కేజ్రీవాల్ సేన కన్నేసి తన సర్వశక్తులనూ ఒడ్డుతోంది.
ఆప్ వస్తే మేం రాం..
గుజరాత్‌ను వరుసగా ఏడోసారి గెల్చుకోవాలని చూస్తున్న భారతీయ జనతాపార్టీ తొలుత ఆప్‌కు గుజరాత్‌లో అవకాశమే లేదని కొట్టి పారేసింది. ఆప్‌పై విమర్శలు గుప్పించింది. దిల్లీ నుంచి మాయమాటలు చెప్పేవాళ్లు వస్తున్నారంటూ ప్రధాని మోదీ సైతం ఆరోపించారు. కానీ లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్.. పాత పింఛను పథకంలాంటి తాయిలాలతో కేజ్రీవాల్ పార్టీ ప్రచారంలో ముందడుగు వేయటంతో భాజపా తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రత్యర్థుల విషయంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆప్‌తో పోటీ పడి మాట్లాడటం; కేజ్రీవాల్ వేసే ప్రశ్నలకు సమాధానాలివ్వటం ఆపేసింది. అంతేగాకుండా.. టీవీల్లో చర్చలకు కూడా ఆప్ ప్రతినిధి వస్తే తమ ప్రతినిధులెవ్వరూ హాజరు కానివ్వకుండా చూస్తోంది. మొత్తానికి.. తమ కంచుకోటలోకి దూసుకు రావాలని ప్రయత్నిస్తున్న ఆప్‌ను కావాలని విస్మరిస్తోంది! అసలు ఆప్ అనేదే పోటీలో లేనట్లు, అలాంటి పేరే విననట్లు వ్యవహరిస్తోంది. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసేనంటూ కమలనాథులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ కూడా ఎక్కడా ఆప్ ఊసు ఎత్తటం లేదు. కేజ్రీవాల్‌నుగాని, ఆప్‌నుగాని విమర్శించటం లేదు. కార్యకర్తలకు కూడా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే అంటూ ఉద్బోధిస్తున్నారు. రాహుల్, సోనియా చేసిన పాత విమర్శలను తవ్వుతూ, వాటినే గుర్తు చేస్తూ ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్‌దీ అదే బాట..
మరోవైపు, ఆప్ రాకతో అయోమయంగా మారిన కాంగ్రెస్ కూడా భాజపా బాటనే పట్టడం విశేషం. టీవీ ఛానళ్లలో చర్చలకు ఆప్ ప్రతినిధి ఉంటే వాటిని కాంగ్రెస్ బహిష్కరించడానికే ప్రాధాన్యమిస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు.. 'మాకు వేయకుంటే భాజపాకు వేయండిగాని.. ఆప్‌కు మాత్రం ఓటు వేయొద్దు' అని ప్రజలకు పిలుపునివ్వటం గమనార్హం!
భాజపా, కాంగ్రెస్‌లెంతగా తమను విస్మరిస్తున్నా కేజ్రీవాల్ పార్టీ మాత్రం భాజపాపై ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తోంది. తమ హామీలను పునరుద్ఘాటిస్తూ ప్రజల్లో ఆశలు రేపే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అయినట్లేనంటూ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయం తామేనని కేజ్రీవాల్ గుజరాతీలను ఒప్పించేందుకు శ్రమిస్తున్నారు. మరి భాజపా, ఆప్‌ల మధ్య ప్రధానంగా సాగుతున్న ఈ మానసిక యుద్ధం ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది చూడాలి.