Gujarat Election 2022 : ప్రధాని నరేంద్రమోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులంతా ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. గుజరాత్ ఆర్థిక మంత్రి కనుభాయ్ మోహన్‌లాలా కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి వల్సాద్‌లో ఓటు వేశారు. మరో మంత్రి హర్ష్ సంఘ్వీ.. గుడిలో పూజలు చేసిన తర్వాత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ సీఎం విజయ్ రూపానీ రాజ్‌కోట్‌లో ఓటువేశారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అమ్రేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనానీ వినూత్నంగా ఓటువేశారు. సైకిల్‌పై సిలిండర్‌ను పెట్టుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేశారు. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటల వరకు 4.92 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యంగా తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతను పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు.
సౌరాష్ట్ర-కచ్ రీజియన్, దక్షిణప్రాంతంలోని 19జిల్లాల పరిధిలోని 89స్థానాలకు.. ఓటింగ్ జరుగుతోంది. 2.39కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారి కోసం 14 వేల 382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో 89మోడల్, 89 పర్యావరణహిత పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. గుజరాత్‌లో ఎప్పుడు ద్విముఖ పోటీ ఉండగా.. ఈసారి ఆప్ ప్రవేశంతో త్రిముఖ పోటీ నెలకొంది. ద్వారక జిల్లాలోని ఖంభాలియా నుంచి ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి, ఇటాలియా నుంచి ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ తొలిదశ బరిలో ఉన్నారు. మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కున్వర్జీ బవలియా, కాంతిలాల్ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా తొలిదశ బరిలో ఉన్నారు.
27ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. వరుసగా ఏడోసారి పట్టు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈసారి కూడా అధికారం భాజపా వశమైతే పశ్చిమ బంగాల్‌లో వామపక్ష కూటమి పేరిట ఉన్న రికార్డ్‌ను చేరుకుంటుంది. బంగాల్‌లో వామపక్ష కూటమి వరుసగా ఏడుసార్లు గెలిచి.. 2011వరకు అధికారంలో కొనసాగింది.
ఇవీ చదవండి: పోలింగ్‌కు తరలి వస్తున్న ప్రజలు.. 9 గంటల వరకు 4.92 శాతం ఓటింగ్
89 స్థానాలు.. 788 మంది అభ్యర్థులు.. గుజరాత్ తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం