గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో ఇటీవల పట్టుబడ్డ 3వేల కేజీల హెరాయిన్‌కు (heroin mundra port) సంబంధించి అధికారులు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.9వేల కోట్లు ఉంటుందని తొలుత భావించిన అధికారులు.. తాజాగా ఆ విలువ రూ.21వేల కోట్లని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
గుజరాత్‌లోని కచ్ జిల్లా ముంద్రా పోర్ట్ (Mundra port drugs) నుంచి 2,988.21 కేజీల హెరాయిన్ ఉన్న రెండు కంటెయినర్లను కొద్ది రోజుల క్రితం డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు సీజ్ చేశారు. ఓ కంటెయినర్లో 1999.57 కేజీలు, రెండో కంటెయినర్లో 988.64 కేజీలు ఉన్నాయి. నమూనా పరీక్షల్లో అది హెరాయిన్ అని నిర్ధరణ అయింది. టాల్క్ స్టోన్ పేరుతో వీటిని విజయవాడకు చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
అంతర్జాతీయ మార్కెట్లో కిలో హెరాయిన్ ధర రూ.5 నుంచి 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇరాన్ మీదుగా..
హెరాయిన్‌ను అఫ్గానిస్థాన్ నుంచి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ మీదుగా గుజరాత్‌కు (mundra port drugs) తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, గాంధీధామ్, మండవీలో తనిఖీలు చేపట్టగా.. చెన్నైలో ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితులు.. ఆషీ ట్రేడింగ్ కంపెనీ నిర్వహకులైన ఎం సుధాకర్, దుర్గా వైశాలి దంపతులుగా అధికారులు గుర్తించారు. సోమవారం వీరిని భుజ్‌లోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితులు పది రోజులు డీఆర్ఐ కస్టడీలో ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈడీ విచారణ
ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్ కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నమోదు చేసుకున్న ఫిర్యాదు వివరాలను అందించాలని ఆ విభాగాన్ని కోరింది.
అసోంలో కూడా..
అసోంలోని అంగ్లాంగ్ జిల్లా కార్బీలో రూ.8 కోట్లు విలువ చేసే 1.5 కేజీ హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. నాగాలాండ్‌కు చెందిన నిందితులు బెసీ మావోస కైహా మావో మణిపుర్ నుంచి గువాహటికి ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సబ్బు డబ్బాల్లో వీటిని తరలిస్తుండగా పట్టుబడ్డారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 'చదువు రాని వ్యక్తి సూసైడ్ నోట్ రాస్తారా?'.. మహంత్ మృతిపై అనుమానాలెన్నో...