గుజరాత్లో తొలి దశ స్థానిక పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) రాష్ట్రంలోని 6 నగర కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ బూత్‌ల వద్ద కొవిడ్ నిబంధనల మధ్య కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.
ఈ కార్పొరేషన్లలో..
అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జామ్‌నగర్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ స్థానిక ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం 575 స్థానాలకు 2276 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. భాజపా నుంచి 577, కాంగ్రెస్ 566, ఆమ్ఆద్మీ పార్టీ 470, ఎన్సీపీ 91, ఇతరులు 353, స్వతంత్రులు 228 మంది తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.
![Gujarat civic polls: Voting in 6 major cities on Sunday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10707419_902_10707419_1613835166002.png)
6 నగరాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. 11,121 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా వాటిల్లో 2255 సున్నితమైనవని, 1188 అత్యంత సున్నితమైనవిగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
అమిత్ షా ఓటు..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లోని నారన్‌పుర వార్డులో ఓటు వేయనున్నారు. ప్రస్తుతం కరోనా చికిత్స తీసుకుంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. రాజ్‌కోట్‌లో ఓటేస్తారు.
![Gujarat civic polls: Voting in 6 major cities on Sunday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9414879-38-9414879-1604395081828_2002newsroom_1613841007_607.jpg)
రెండో దశలో 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: గుజరాత్ ప్రజల మనసు గెలుచుకుంటాం: ఓవైసీ