గుజరాత్ అహ్మదాబాద్‌లో కరోనా బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 5వైలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాంతో 108, 104 అంబులెన్సుల కోసం కరోనా రోగులు.. 24 నుంచి 36 గంటల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి 'పనాహ్ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. అహ్మాదాబాద్ ఆటో డ్రైవర్ యూనియన్‌తో కలిసి ఆటో అంబులెన్సు సర్వీసును ప్రారంభించింది.

హెల్ప్‌లైన్ నంబర్ కూడా..
కరోనా రోగులకు వేగంగా అంబులెన్సు సర్వీసును అందించేందుకు ఓ హెల్ప్ లైన్ నంబర్‌ను కూడా ప్రవేశ పెట్టిందీ సంస్థ. 7600660760 అనే నంబర్‌కు ఫోన్ చేస్తే.. కరోనా రోగుల కోసం అంబులెన్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. దాంట్లో వారిని సీటీ స్కాన్, ఎక్స్‌రే కోసం ఆసుపత్రులకు తరలిస్తారు. ప్రస్తుతం 10 ఆటోలు ఈ అంబులెన్సు సేవలను అందిస్తున్నాయి.

తగు జాగ్రత్తలతో..
ఆటో డ్రైవర్లకు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రైవర్‌కు, రోగుల మధ్య దూరం ఉండేలా.. ఓ విభజన ఉంటుంది. అంతేకాకుండా.. డ్రైవర్లు పీపీఈ కిట్లను ధరిస్తారని, గ్లౌజులు, మాస్కు, శానిటైజర్లను వాడతారని పనాహ్ ఫౌండేషన్‌కు చెందిన మమతా రావత్ తెలిపారు. రోగులకు, డ్రైవర్లకు ప్రత్యేక వాటర్ బాటిళ్లు ఉంటాయని చెప్పారు.

ఒకవేళ ఆటోడ్రైవర్లు గనుక కరోనా బారిన పడితే వారి వైద్యచికిత్సను పనాహ్ ఫౌండేషనే భరిస్తుంది. ఆటోలకు గ్యాస్, పెట్రోల్ ఖర్చులనూ అందిస్తుంది. అంబులెన్సు సర్వీసులు మాత్రమే కాకుండా... హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఔషధాలు, ఆహారాన్ని ఈ అంబులెన్సుల ద్వారా పనాహ్ ఫౌండేషన్ చేరవేస్తుంది.
ఇదీ చూడండి: ఒకే గదిలో వందకు పైగా కరోనా రోగులు!
ఇదీ చూడండి: ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్