గుజరాత్లో 2019 నుంచి రెండేళ్ల వ్యవధిలో మొత్తం 313 సింహాలు మరణించాయని ఆ రాష్ట్ర అటవీశాఖ వెల్లడించింది. ఇందులో 152 పిల్లలు ఉన్నాయని పేర్కొంది.
అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విర్జీ తుమ్మర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ వివరాలను వెల్లడించారు అటవీశాఖ మంత్రి గణ్‌పత్ వాసవ. 2019లో 154 మృగరాజులు చనిపోగా; 2020లో 159 సింహాలు మరణించినట్లు తెలిపారు. వీటిలో 90 ఆడ, 71 మగ సింహాలు, 152 పిల్లలు ఉన్నాయని వివరించారు. మొత్తంగా 23 సింహాలు బావుల్లో పడటం, వాహన ప్రమాదం వంటి ఘటనల ద్వారా అసహజంగా మరణించాయని చెప్పారు.
ఇదీ చదవండి: దేశంలోని వృద్ధ సింహం మృతి
అయితే.. మృగరాజులను బావి ప్రమాదాల నుంచి కాపాడేందుకు.. గిర్ అభయారణ్యం ప్రాంతంలో సుమారు 43వేల బావులకు ప్రత్యేక గోడలను నిర్మించినట్టు గణ్‌పత్ తెలిపారు. ఇటువంటి సంరక్షణ చర్యలతోనే 2015లో 523 గా ఉన్న సింహాల సంఖ్యను.. 2020 నాటికి 674కు(29శాతం) పెంచామని ఆయన స్పష్టం చేశారు.
ఆ రాష్ట్రంలో అటవీ పరిరక్షణ కోసం.. కేంద్రం రెండేళ్లలో 108కోట్ల నిధులు వెచ్చించింది.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్: ధౌలీగంగాపై కొత్త వంతెన ప్రారంభం