తాను డిగ్రీ చదువుకున్న రోజుల్లో డాక్టర్ కావాలని కలలు కన్నారు ఆ బామ్మ. కానీ అది కొన్ని దశాబ్దాల పాటు కలగానే మిగిలిపోయింది. అయితే స్ఫూర్తి, పట్టుదలతో కృషి చేసిన ఆమె.. 67ఏళ్ల వయసులో జైనిజంలో డాక్టరేట్ పొంది.. 20 ఏళ్ల నాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. ఆమే గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఉషా లోదయ.
20 ఏళ్ల వయసులో పెళ్లి కారణంగా ఉషా.. కళాశాల చదువుకు దూరమయ్యారు. అయితే జైన మత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన మహారాష్ట్రకు చెందిన శత్రుంజయ్ అకాడమీలో జైనిజం కోర్సులో చేశారు. దీనిలో భాగంగా షష్టిపూర్తి చేసుకున్న ఉషా.. జైన సంప్రదాయంలోని 12 ఆధ్యాత్మిక చింతనలపై జరిగిన వైవా వాయిస్‌లో పాసై.. డాక్టరేట్‌ను పొందారు.
"దశాబ్దాల క్రితం బీఎస్సీలో చేరినప్పటి నుంచి డాక్టర్ కావాలన్నది నా కల. అయితే వివాహం కారణంగా 20 ఏళ్ల వయసులో కళాశాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది" అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చారు లోదయ.
గురూజీ స్ఫూర్తితో..
జైన మత పండితుడు.. తన గురువు జయదర్శితాశ్రీజీ మహారాజ్ స్ఫూర్తితో మళ్లీ తన ఆశయాన్ని చేరుకోవాలన్న పట్టుదల పెరిగిందని లోదయ చెప్పారు. దీంతో మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ట్రస్ట్ రన్ ఇనిస్టిట్యూట్‌లో జైనమత ఆన్‌లైన్ కోర్సులో చేరినట్లు ఉషా పేర్కొన్నారు. ఇందులో రెండేళ్ల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి.. మరో మూడేళ్లు డాక్టరేట్ కోర్సు చేసినట్లు ఆమె వెల్లడించారు.
" గురూజీ ప్రేరణతోనే నా దశాబ్దాల నాటి కల నెరవేరింది. జైన మతానికి చెందిన వ్యక్తిగా.. మత ప్రచారం చేయాలని భావిస్తున్నాను. అలాగే నా వద్దకు వచ్చిన విద్యార్థులకు తప్పక జైన మతం గురించి బోధిస్తాను" అని ఉషా చెప్పారు.
ఇదీ చూడండి: 'క్లిష్ట సమయంలో కేంద్ర-రాష్ట్రాల సమన్వయం భేష్'