GST officials Kidnapping in Hyderabad : హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. నకిలీ జీఎస్టీ కేసులకు సంబంధించి తనిఖీల్లో భాగంగా స్క్రాప్, వెల్డింగ్ షాప్ తనిఖీకి వెళ్లిన ఇద్దరు జీఎస్టీ అధికారులను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ తెలిపిన వివరాలు ప్రకారం.. నకిలీ జీఎస్టీ కేసులకు సంబంధించి తనిఖీల్లో భాగంగా మణిశర్మ, ఆనంద్ అనే ఇద్దరు జీఎస్టీ అధికారులు ఇవాళ సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయి కృష్ణానగర్లో స్క్రాప్, వెల్డింగ్ షాప్ తనిఖీకి వెళ్లారు. షాపు యాజమానులను జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌లు ప్రశ్నించగా.. వెంటనే స్క్రాప్ గోడౌన్ నిర్వహకులు జీఎస్టీ అధికారుల ఐడీ కార్డులను లాక్కున్నారు.
అనంతరం మణిశర్మ, ఆనంద్‌లను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం వారి నుంచి రూ.5లక్షలు డిమాండ్ చేశారు. మణిశర్మ చాకచౌక్యంగా వ్యవహరించి తెలివిగా ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి నాలుగు వైపుల వాహన తనిఖీ నిర్వహించారు.
చివరికి రాజీవ్‌చౌక్ వద్ద నలుగురు కిడ్నాపర్‌లను గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఫిరోజ్, ముజీబ్, ఇంతియాజ్‌లుగా గుర్తించారు. ఖయ్యూం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలోనే కిడ్నాపర్ల వాహనాన్ని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. వారిపై ఇది వరకు ఏమైన నేర చరిత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
"సెంట్రల్ జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసినట్టు ఉదయం 10:30 నిమిషాలకు ఫిర్యాదు అందింది. ఫేక్ జీఎస్టీ కేసులకు సంబంధించి తనిఖీల్లో భాగంగా మణిశర్మ, ఆనంద్ అనే జీఎస్టీ ఇన్‌స్పెక్టర్లను సాయి కృష్ణానగర్లో స్క్రాప్, వెల్డింగ్ షాప్ తనిఖీకి వచ్చారు. ఆ సమయంలో స్క్రాప్ గోడౌన్ నిర్వహకులు జీఎస్టీ అధికారుల ఐడీ కార్డులు లాక్కున్నారు. అనంతరం వారిని వాహనంలో ఎక్కించుకున్నారు. ఇద్దరిపై దాడి చేసి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. మణిశర్మ వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు రాజీవ్‌చౌక్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకొని కిడ్నాపర్ల చెర నుంచి అధికారులను సేవ్ చేశాం. ఫిరోజ్, ముజీబ్, ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకున్నాం. ఖయ్యూం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు." -సాయి శ్రీ, ఎల్బీనగర్ డీసీపీ
ఇవీ చదవండి: