అభివృద్ధి పేరుతో మానవుడు చేస్తున్న పనులు భూమండలానికి శాపంగా(global warming) మారుతున్నాయి. పర్యావరణ మార్పులతో(climate change) మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ సమస్యపై ఎంతో మంది పోరాడుతున్నారు. అతిచిన్న వయసులో వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తున్న చిన్నారి గ్రేటా థన్‌బర్గ్ అందరికి సుపరిచితమే. భారత మూలాలు ఉన్న ఓ బాలుడు సైతం వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తూ.. అందరి మన్ననలు పొందుతున్నాడు. అతనే.. నాలుగో తరగతి విద్యార్థి శిరీష్.
తమిళనాడుకు చెందిన శుభాష్ అరుముగమ్, తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. జార్జియాలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. ఆయన కుమారుడే శిరీష్. మరియెట్ట సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ అకాడమిక్స్‌లో 4వ తరగతి చదవుతున్నాడు. ఎంతో చురుకుగా ఉండే శిరీష్లోని నైపుణ్యాన్ని గుర్తించిన టీచర్ అజాలా హెర్బల్.. సైన్స్ వైపు ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే ఐదున్నరేళ్ల వయసులో ఉన్నప్పుడు పర్యావరణ మార్పులపై వచ్చిన 'బిఫోర్ ది ఫ్లడ్' అనే డాక్యుమెంటరీ చూశాడు శిరీష్. మరింత తెలుసుకునే ప్రయత్నంలో.. వాతారవణ మార్పులపై తన వంతుగా కృషి చేయాలని నిశ్చయించుకున్నాడు.
ఈ క్రమంలోనే 2018లో తన పుట్టిన రోజు సందర్భంగా పర్యావరణ మార్పులపై తన ఆలోచనలను స్నేహితులతో పంచుకున్నాడు శిరీష్. ఎనిమిదేళ్ల వయసులో ఈ సమస్యపై 'కార్బన్ బ్లాక్ పజిల్' పుస్తకం(book on climate change) రాయటం ప్రారంభించాడు. 10 ఏళ్లు వచ్చేసరికి విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ పుస్తకాన్ని అమెజాన్‌లో విక్రయానికి పెట్టగా.. ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా మంది చదివారు.
రికార్డులు..
పర్యావరణ మార్పులపై(climate change causes) పుస్తకం రాసి.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న క్రమంలో శిరీష్‌కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. మరోవైపు.. శిరీష్ ఐక్యూ స్థాయిని పరీక్షించిన పాఠశాల యాజమాన్యం.. నాలుగో తరగతి నుంచి ఆరో తరగతికి పంపించారు.
"కార్బన్ బ్లాక్ పజిల్ పుస్తకంలో పర్యావరణ మార్పులు, వాటి ప్రభావం, నివారణపై రాశాను. అలాగే వాతావరణ మార్పులను తగ్గించేందుకు ప్రజలను ఈ పుస్తకం ప్రోత్సహిస్తుంది. భారత్‌లో పర్యావరణ మార్పుల సమస్య వేగంగా పెరుగుతోంది. వాతావరణ మార్పులు అనేది అంతర్జాతీయ సమస్య. ఒక్కొ దేశంలో ఒక్క స్థాయిలో ఉంది. భారత్‌లో ఆ సమస్య మరింత ఆందోళనకరంగా ఉంది. గణాంకాలను పరిశీలిస్తే.. సముద్ర మట్టం వేగంగా పెరుగుతున్నందన భారత్‌లోని చాలా తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది."
- శిరీష్, విద్యార్థి
భావిష్యత్తులో పర్యావరణవేత్తగా(young climate activists) మారాలనుకుంటున్నానని, వాతావరణ మార్పులపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పిస్తానని చెప్పాడు. శిరీష్‌కు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు తల్లిదండ్రులు. పర్యావరణ మార్పులకు మంచి పరిష్కారం కనుగొంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: వాతావరణ మార్పులపై మేలుకోకుంటే తప్పదు విపత్తు