రాముడి జన్మస్థలం అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించిన మహా దీపోత్సవంతో అయోధ్య దివ్వెల వెలుగుల్లో సరికొత్తగా కాంతులీనింది. 5లక్షల 51వేల దీపాలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు అధికారులు. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దేవతా రూపాలు
మహా దీపోత్సవంతో యావత్ అయోధ్యపురి పులకించిపోయింది. సరయూ తీరం వెంబడి కనుచూపమేర కొలువుతీరిన 5లక్షల 51వేల దీపాలతో అయోధ్య నగరం కాంతులీనింది. ఎటు చూసినా వెలుగులే అన్నట్లు సాగిన ఈ దీపోత్సవం.. రామ జన్మస్థలానికి కొత్త శోభను తీసుకువచ్చింది. వేడుకల్లో భాగంగా దీపాలతో తీర్చిదిద్దిన వివిధ దేవతా మూర్తుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మహా దీపోత్సవం సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేలపై ఆకట్టుకునే రీతిలో ముగ్గులు, వివిధ దేవతా మూర్తుల చిత్రాలను ఏర్పాటు చేశారు. రాముడు, సీత వేషాలు ధరించిన కళాకారులు దీపోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: దీపావళి స్పెషల్- 'క్యారెట్ గులాబ్జామ్' చేయండిలా..