ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్కు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi News) చేరుకున్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ నేత దీపెందర్ సింగ్ హూడా, మరికొంతమంది కాంగ్రెస్ శ్రేణలు ఉన్నారు. భారీ భద్రత దృష్ట్యా.. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించేందుకు ప్రియాంక బృందం సన్నాహాలు చేస్తోంది. అంతకుముందు.. ప్రియాంక లఖ్నవూ నుంచి ఆదివారం అర్ధరాత్రి లఖింపుర్కు పయనమయ్యారు. అంతలోనే తనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని.. ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.
" బాధితుల కుటుంబాలను కలిసేందుకు మాత్రమే వెళ్తున్నాం. వారి కన్నీళ్లు తుడిచేందుకు వెళ్తున్నాం. మేము ఎలాంటి నేరం చేయటం లేదు. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మీకు వారెంట్ ఉందా?"
-- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
వర్ణించలేని రీతిలో దేశంలోని రైతులు అణచివేతకు గురయ్యారని ప్రియాంక(Priyanka Gandhi News) ఆవేదన వ్యక్తం చేశారు. గతకొన్ని నెలలుగా రైతులు.. తమ గళాన్ని వినిపిస్తున్నారన్నారు. అయినా ప్రభుత్వం వాళ్లను పట్టించుకోవటం లేదన్నారు. రాజకీయాలతో రైతులను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రాను కూడా అడ్డుకున్నారు పోలీసులు.
దేశవ్యాప్తంగా నిరసనలు..
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాలు.. దేశంలోని అన్ని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసన చేపట్టేందుకు పిలుపునిచ్చాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ నిరసన కొనసాగనున్నట్లు వెల్లడించాయి. లఖింపుర్ ఘటనకు సంబంధించి దర్యాప్తును సుప్రీంకోర్టే విచారణ చేపట్టాలని.. ఈ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను వెంటనే పదవిలోంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు.
మర్డర్ కేసు పెట్టాలి..
ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ స్పందించారు. ఈ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను వెంటనే పదవిలోంచి తొలగించాలని, అతని కుమారుడిపై మర్డర్ కేసు నమోదు చేయాలన్నారు.
చూస్తూ ఊరుకోం..
లఖింపుర్ ఘటనపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఈ ఘటనకు కేంద్రమంత్రి అజయ్ కుమార్ కుమారుడే కారణమని దుయ్యబట్టారు. భాజాపా నియంత్రణ పాలనను ఉత్తర్ప్రదేశ్ చూస్తూ ఊరుకోదన్నారు.
ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భాగేల్, సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీ, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ లఖింపుర్లో సోమవారం పర్యటించనున్నారు.
'నా కుమారుడు అక్కడ లేడు..'
రైతుల ముసుగులో దాగున్న కొంతమంది అసాంఘిక శక్తులు భాజాపా శ్రేణుల కార్లపై దాడి చేశారని కేంద్ర హోం సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. ఘటనా సమయంలో తన కుమారుడు కారులో లేరని తెలిపారు. మరోవైపు.. ఇదే విషయంపై మాట్లాడారు అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా. తమ కార్యకర్తలపై కొంతమంది దాడి చేశారని.. ఉదయం 9గంటల నుంచి తాను బన్బిర్పుర్లోనే ఉన్నానన్నారు. ఘటనాస్థలిలో తాను రెండు రోజులుగా లేనని తెలిపారు. తానంటే గిట్టనివారు.. కావాలనే తనపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ జరిగింది..
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తమపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లిందని రైతులు ఆరోపించారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు.
ఇదీ చదవండి: నిరసనలో హింస- ఇద్దరు రైతులు సహా 8 మంది మృతి!