దేశంలో 6 రకాల వంట నూనెల ధరలు (Edible Oil Price) ఏడాది కాలంలో దాదాపు 50% వరకూ పెరిగాయి! కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ శుక్రవారం విడుదలచేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గత ఏడాది అక్టోబరు 21 నాటి ధరలతో పోలిస్తే, ఈ అక్టోబరు 21 నాటికి సోయాబీన్ నూనె గరిష్ఠంగా 49% మేర, వేరుశనగ నూనె (Edible Oil Price) కనిష్ఠంగా 18.71% దాకా పెరిగాయి. అంతర్జాతీయంగా నూనె ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్‌లో ఆ ప్రభావం కనిపించినట్టు ఆహార, ప్రజా పంపిణీశాఖ కార్యదర్శి సుధాంశు పాండే పేర్కొన్నారు. ఏడాది కాలంలో అంతర్జాతీయంగా ముడి పామాయిల్ ధర 81.66%, సన్‌ఫ్లవర్ ధర 40.91% మేర పెరిగినట్టు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ఈ ప్రభావం దేశీయ వినియోగదారులపై పూర్తిగా పడలేదని (Edible Oil Price) పాండే పేర్కొన్నారు. దిగుమతి సుంకాలను తగ్గించడం, ఆయిల్ నిల్వలపై పరిమితులు విధించడం వల్ల కొంత సత్ఫలితాలు వస్తున్నట్టు పాండే చెప్పారు. ఆయిల్ పరిశ్రమలు తమ వద్దనున్న నిల్వలను బహిర్గతం చేసేందుకు పోర్టల్‌ను ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం ఇందులో సుమారు 2 వేల మంది మిల్లర్లు, రిఫైనర్లు, స్టాకిస్టులు, టోకు వర్తకులు వివరాలు వెల్లడిస్తున్నట్టు తెలిపారు. రిటైల్ ధరలను అన్నిచోట్లా బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
తవుడు నూనె ఉత్పత్తిపై దృష్టి
వరి అధికంగా పండే ప్రాంతాల్లో తవుడు ద్వారా నూనె ఉత్పత్తి చేయడంపై (రైస్‌బ్రాన్) దృష్టి సారించాలని రాష్ట్రాలను కోరినట్లు సుధాంశు పాండే వెల్లడించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్రస్థాయిలో రైస్ మిల్లర్లు, క్షేత్ర అధికారులతో కార్యశాలలు ఏర్పాటు చేయాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సూచించామన్నారు. మిల్లర్లు కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా రైస్‌బ్రాన్ ఆయిల్ ఉత్పత్తికి ప్రయత్నించాలన్నారు.
ఇదీ చూడండి : 'సుప్రీం' విజయం.. ఆ 39 మందికి శాశ్వత కమిషన్