Central Cabinet Meeting Decision Today : చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2023-24 సీజన్‌కు గానూ చెరకు ధరను క్వింటాల్‌కు రూ.10 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుత చెరకు రూ.315కు చేరిందని వెల్లడించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో.. చెరకు సరసమైన లాభదాయక ధర(ఎఫ్‌ఆర్‌పి)ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014-15 సీజన్‌లో క్వింటాల్‌కు రూ.210 ఉన్న చెరకు ధర.. 2023-24 సీజన్‌కు క్వింటాల్‌కు రూ.315కు చేరిందని ప్రభుత్వం వెల్లడించింది.
సమావేశం అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ప్రధాని ఎప్పుడూ అన్నదాతపక్షానే ఉంటారని తెలిపారు. వ్యవసాయానికి, రైతులకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో రూ.1,11,366 కోట్ల విలువైన సుమారు 3,353 లక్షల టన్నుల చెరకును.. చక్కెర మిల్లులు కొనుగోలు చేశాయని ఠాకూర్ వివరించారు. 2013-14లో వీటి విలువ కేవలం రూ. 57,104 కోట్లే ఉండేదన్నారు.
దేశంలోనే తొలిసారిగా సల్ఫర్ పూతతో కూడిన యూరియా (యూరియా గోల్డ్)ను ప్రవేశపెడుతున్నట్లు మరో మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న నీమ్ కోటెడ్ యూరియా కంటే ఇది మరింత పొదుపుగా, సమర్థంగా పని చేస్తుందని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు కూడా లక్షకు చేరుకున్నాయని వెల్లడించారు.
కేబినెట్ తీసుకున్న మరిన్ని ముఖ్య నిర్ణయాలు..
- రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన రూ.3.70 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని వివిధ పథకాల ద్వారా రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయనుంది. స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతుల శ్రేయస్సు, ఆర్థిక మెరుగుదలపై దృష్టి సారించేందుకు దోహదం చేసే విభిన్న పథకాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి.
- 45 కిలోల యూరియా బస్తాను రైతులకు రూ. 242కే ఇచ్చే సబ్సిడీ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఈ ధరలో పన్నులు, నీమ్ కోటింగ్ ఛార్జీలు మినహాయించి ఉంటాయి.
- ఈ 3.70 లక్షల కోట్లను మొత్తం మూడు సంవత్సరాలలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
- నేల పునరుద్ధరణ, దానిపై రైతులకు అవగాహన కల్పించడం, పోషణ, మెరుగుదలకు ఉద్ధేశించిన పథకం (PMPRANAM) గురించి మంత్రులు సమావేశంలో చర్చించారు.
- PMPRANAM పథకం కింద రైతులు సహజ, సేంద్రీయ ఎరువులు.. నానో, బయో ఎరువుల లాంటి ఇతర ప్రత్యామ్నాయ ఎరువులు వాడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
- రైతులు ప్రత్యామ్నాయ ఎరువులు వాడటం, రసాయన ఎరువుల వాడకంలో సమతుల్యం పాటించేలా చేయడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది.
- ఇవీ చదవండి:
- రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు.. కిలోకు రూ.34 ఇస్తామన్న ప్రభుత్వం
- QS Ranking 2023 : ఐఐటీ బాంబే అరుదైన ఘనత.. ప్రపంచలోని టాప్ 150 యూనివర్సిటీల లిస్ట్‌లో స్థానం