ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. బుద్గాం జిల్లా చడూరాలోని సర్కారీ కార్యాలయం వద్దే ఈ ఘటన జరిగింది. మృతుడ్ని రాహుల్ భట్‌గా గుర్తించారు.
రాహుల్.. షేక్‌పురాలోని వలసదారుల కాలనీ వాసి. చడూరా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 4.30 గంటలకు ఒక్కసారిగా ఆఫీస్ వద్దకు వచ్చిన ముష్కరులు.. రాహుల్‌పై కాల్పులు జరిపి, పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. కాసేపటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాహుల్‌కు భార్య, ఐదేళ్ల కూతురు ఉన్నారు. తండ్రి రిటైర్డ్ పోలీసు అధికారి. తల్లిదండ్రులు సైతం రాహుల్ వద్దే ఉంటున్నారు.
హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ముష్కరులు లష్కరే తొయిబా ముఠాకు చెందినవారిగా గుర్తించినట్లు జమ్ము కశ్మీర్ ఐజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. నిందితుల్లో ఒకరికి శ్రీనగర్‌లో జరిగిన హత్యల కేసుల్లో ప్రమేయం ఉందని చెప్పారు.
2021 అక్టోబర్ 6న కశ్మీరీ పండిట్ అయిన మఖన్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు మట్టుబెట్టారు. ఆ తర్వాత జరిగిన రెండో కశ్మీరీ పండిట్ హత్య ఇదే. 2019 తర్వాత మొత్తం 14 మంది మైనారిటీలను ఉగ్రవాదులు హత్య చేశారు. వ్యాపారులు, సర్పంచ్‌లు, స్థానిక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.
మరోవైపు, ఈ హత్యకు నిరసనగా ఉద్యోగులు జాతీయ రహదారిపై బైఠాయించారు. రాకపోకలను అడ్డుకున్నారు. అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల లక్షిత దాడులను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.