అఫ్గానిస్థాన్‌లో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న వేళ భారత పౌరులను తరలించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అఫ్గానిస్థాన్ సంక్షోభంపై(Afghan crisis) అఖిలపక్ష సమావేశం(all party meeting) సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అధ్యక్షతన పార్లమెంట్ ప్రాంగణంలో ఈ సమావేశం నిర్వహించారు. అఫ్గాన్‌లో తాజా పరిస్థితులు, భారత పౌరుల తరలింపు తదితర కీలక అంశాలపై అఖిలపక్ష నేతలకు జైశంకర్ వివరించారు.
" సాధ్యమైనంత మేరకు అఫ్గానిస్థాన్ నుంచి ప్రజలను తరలించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అయితే.. భారత పౌరులను తరలించటమే మా తొలి ప్రాధాన్యం. అఫ్గాన్‌లో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. దోహా ఒప్పందాన్ని తాలిబన్లు ఉల్లంఘించారు. "
- జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి.
ఈ భేటీకి.. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్‌తో పాటు మరికొందరు మంత్రులు సహా కాంగ్రెస్ తరఫున అధీర్ రంజన్ చౌదురీ, మల్లికార్జున ఖర్గే, ఆనంద్‌శర్మ, ఎన్సీపీ తరఫున శరద్‌పవార్, జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ, తెరాస తరఫున నామా నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్, వైకాపా నుంచి మిథున్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: Afghan Crisis: కాబుల్ నుంచి భారత్‌కు మరో 35 మంది