COVID-19 restrictions: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఆయా ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితులపై సమీక్షించి.. ఆంక్షలను సడలించాలని లేదా ఉపసంహరించుకోవాలని పేర్కొంది. రోజువారీ కరోనా కేసులు, పాజిటివిటీ రేటును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర పాలితప్రాంతాల ముఖ్య పాలనాధికారులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. జనవరి 21 నుంచి దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
కొద్దిరోజుల క్రితం కరోనా విజృంభించిన కారణంగా.. చాలా రాష్ట్రాలు సరిహద్దులు, విమానాశ్రయాల్లో అదనపు ఆంక్షలు విధించినట్లు భూషణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని, వారి ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. అయితే.. టెస్ట్, ట్రాక్, ట్రీట్ సహా వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండటం తప్పనిసరిగా చేయాలని ఉద్ఘాటించారు.
International Passengers Quarantine: అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలను సడలించిన విషయాన్ని కూడా భూషణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కొవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను కేంద్రం ఇటీవలే సడలించింది. ప్రయాణికులు ఇకపై ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ స్థానంలో ప్రయాణికులు 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణ చేసుకుంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈనెల 14న అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.
ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
భారత్‌లో గత వారం సగటున రోజుకు 50 వేల 476 కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలో 30,615 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ ధాటికి మరో 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 82,988 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
New Recombinant Variants of Covid: మరోవైపు.. కొవిడ్ రీకాంబినెంట్ వేరియంట్ల గురించి ప్రస్తుతానికి ఆందోళన అనవసరమని ప్రముఖ వైరాలజిస్ట్ వినోద్ సెరియా తెలిపారు. ఇటీవల యూకే, ఇండియాలో XA, అమెరికాలో XB, జపాన్‌లో XC (ఆల్ఫా+డెల్టా) రీకాంబినెంట్ వేరియంట్లు కనిపించాయని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న డెల్టా- ఒమిక్రాన్ రీకాంబినెంట్ వేరియంట్ సంకేతాలు కనిపించాయని బ్రిటన్ ప్రకటించింది.
Goa Vaccination: గోవాలో వ్యాక్సినేషన్ నూరు శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన 11.66 లక్షల జనాభాకు కరోనా టీకా రెండు డోసులు అందించినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేయనున్నట్లు రాష్ట్ర వైద్య సేవల విభాగం వెల్లడించింది. ఇకపై ఇతర సాధారణ టీకా పంపిణీ కార్యక్రమాల్లోనే.. కరోనా వ్యాక్సిన్‌ను భాగం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Kerala Corona cases: కేరళలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం మరో 12,233 మందికి వైరస్ సోకింది. 25 మరణాలు నమోదయ్యాయి.
ముంబయిలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 255 కొత్త కేసులు వెలుగుచూడగా.. ఒక్కరూ మరణించలేదని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: పంజాబ్ చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు? కింగ్ మేకర్‌గా ఆ పార్టీ?
India Covid cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు