కర్ణాటకలోని మిత్తూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని భావించారు ఉద్యోగులు. అందుకోసం ఆదాయ మార్గాలను వెతికారు. నాలుగు ఎకరాలలో ఉన్న పాఠశాల ఆవరణలో ఉన్న 628 పోకవక్క చెట్లకు కాసిన వక్కలను విక్రయించారు. తద్వారా సమకూరిన ఆదాయంతో బస్సును కొన్నారు.
ఐదేళ్ల శ్రమ!
పాఠశాల ఆవరణలోని పోక చెట్లను ఐదేళ్ల క్రితం నాటారు. పాఠశాల అభివృద్ధి సంస్థ ఇందుకోసం నిధులు కేటాయించింది. మొదటగా 628 పోకమొక్కలను నాటారు. వాటి బాగోగుల కోసం గ్రామస్థులు నడుంబిగించారు. గార్డెన్ నిర్వహణ కోసం విద్యార్థులు, టీచర్లతో పాటు గ్రామస్థులు పాలుపంచుకున్నారు. ఏడాది క్రితం వృక్షాలు కోతకు వచ్చాయి. దీంతో ఆ ఆదాయాన్ని పాఠశాల అభివృద్ధికే కేటాయించాలనుకున్నారు.
డీజిల్ ఖర్చులు తల్లిదండ్రులవే...
120 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో అధిక మంది ఆటోలు, రిక్షాలలో వస్తుంటారు. అయితే పాఠశాలకు ఆలస్యం అవుతుండటం, అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతుండటం వల్ల ఓ బస్సును కొనాలని నిశ్చయించుకున్నారు. ఈ స్కూల్ బస్సును ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ మతంధూర్ ప్రారంభించారు. డీజిల్ ఖర్చులను విద్యార్థుల తల్లిదండ్రులే భరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు ఏ ఇబ్బందీ లేకుండా బడికి వస్తున్నారనీ, ఐదేళ్లక్రితం చేసిన ఓ మంచిపని ఇప్పడు ఫలించిందని ఓ ఉపాధ్యాయుడు అన్నారు.