Government Permission For Second Marriage : ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని స్పష్టం చేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ. సర్వీస్ నిబంధనలకు ఇది వ్యతిరేకమని చెప్పారు. కొన్ని మతాలు రెండో పెళ్లికి అనుమతి ఇస్తాయని.. అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఇద్దరు భార్యలు ఉన్న ఉద్యోగి మరణం తర్వాత పెన్షన్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయని.. వీటిని పరిష్కరించడం కష్టంగా మారిందని చెప్పారు సీఎం. ఈ నిబంధన ఇప్పటికే ఉందని.. కానీ తాజాగా దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
Assam Polygamy Ban : బహుభార్యత్వాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం బిల్లును రూపొందిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది హిమంత సర్కార్. ఇందుకోసం అడ్వకేట్ జనరల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది ప్రభుత్వం. బహుభార్యత్వం రద్దుతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలతో మతాంతర వివాహాలు, బాల్య వివాహాలపై అధ్యయనం చేయాలని సూచించింది.
బాల్యవివాహాలపై మరోసారి ఉక్కుపాదం
మరోవైపు చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న వారిపై ఇటీవలె మరోసారి కొరడా ఝుళిపించింది అసోం ప్రభుత్వం. మరో 800 మందికి పైగా అరెస్టు చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ ఏడాది ప్రారంభంలో చేపట్టిన మొదటి దశలో 2,278 మందిని అరెస్టు చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల ఎదుట నిరసన చేపట్టడం సంచలనంగా మారింది.
రాష్ట్రంలో బాల్య వివాహాలు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు మైనర్లను పెళ్లి చేసుకున్నవారిని అరెస్టు చేయాలని కొన్ని నెలల క్రితం అసోం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద, 14 ఏళ్ల లోపు వారిని పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని సూచించింది. ఈ అరెస్టు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం ప్రకటించారు. బాల్య వివాహం చేసుకున్న వారితో పాటు దీనికి సహకరించిన మత పెద్దలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
India Name Change In Text Books : 'ఇకపై టెక్స్ట్ బుక్స్‌లో 'ఇండియా' బదులు భారత్!'