గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో తలెత్తిన పొరపాటు కన్నడిగులను ఆగ్రహానికి గురిచేసింది. 'అగ్లీయస్ట్ ల్యాంగ్వేజ్ ఆఫ్ ఇండియా' అనే సెర్చ్‌కు కన్నడ అంటూ గూగుల్ ఇచ్చిన ఫలితాలను నెటిజన్లు సహా కర్ణాటక ప్రభుత్వం తప్పుపట్టింది. సంస్థకు లీగల్ నోటీసులు పంపిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఈ వివాదంపై గూగుల్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్య వల్లే ఈ పొరపాటు జరిగిందని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. ఆ సెర్చ్‌కు గూగుల్ ఇచ్చిన ఫలితాలను తొలగించింది.
"ప్రతిసారి సెర్చ్‌కు సరైన ఫలితాలు రావు. ఒక్కోసారి కొన్ని ప్రశ్నలకు ఆశ్చర్యాన్ని కలిగించే ఫలితాలు సెర్చ్‌లో వస్తుంటాయి. ఇది పద్ధతి కాదని మాకు తెలుసు.. కానీ మా దృష్టికి వచ్చిన ప్రతి తప్పును సరిదిద్దేందుకే ప్రయత్నిస్తున్నాం. అల్గారిథమ్లు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాం. ఈ సాంకేతిక సమస్యలకు గూగుల్ అభిప్రాయానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ కారణంగా మనోభావాలు దెబ్బతిన్న వారికి మేము క్షమాపణలు కోరుతున్నాం."
-గూగుల్
అసలేం జరిగింది?
సెర్చ్ ఇంజిన్‌లో గురువారం 'అగ్లీయస్ట్ ల్యాంగ్వేజ్ ఆఫ్ ఇండియా' (దేశంలోనే చెత్త భాష) అనే సెర్చ్‌కు గూగుల్.. కన్నడ భాష అని సమాధానం ఇచ్చింది. ఈ విషయాన్ని మొదట ఓ వెబ్సైట్ ప్రస్తావించింది. ఆ తర్వాత దీనిపై కర్ణాటక మంత్రి అరవింద్ లింబావాలి స్పందించారు. 2,500ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కన్నడ భాషను గూగుల్ ఇలా సంబోధించడం అవమానకరమని.. దీనికి వెంటనే సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బెంగళూరు సెంట్రల్ ఎంపీ సీఏ మోహన్ కూడా గూగుల్ ఇస్తున్న ఫలితాలను స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ స్క్రీన్‌షాట్ వైరల్ కావడం వల్ల సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున నిరసన వ్యక్తం అయింది. గూగుల్ ఆ ఫలితాలను తొలగించాలని, పొరపాటుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గూగుల్‌పై ఫిర్యాదు..
కన్నడ భాషకు సంబంధించి గూగుల్ ఇచ్చిన ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సంస్థపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి : IT Rules 2021: 'కొత్త నిబంధనలు గూగుల్‌కు వర్తించవు'