అక్రమంగా రవాణా చేస్తున్న 61 కిలోల బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారం విలువ రూ.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు వేర్వేరు కేసుల్లో ఈ బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని వెల్లడించారు. ఒక్కరోజులో పట్టుబడిన అత్యధిక బంగారం ఇదేనని అధికారులు తెలిపారు.
టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులు.. బంగారాన్ని బిస్కెట్లు రూపంలో తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అమర్చిన బెల్టులలో వీటిని అమర్చి తీసుకొస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి 55 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం బిస్కెట్ల ధర రూ.28.17 కోట్లు ఉంటుందని తెలిపారు. వీరికి ఈ బంగారాన్ని దోహా విమానాశ్రయంలో సుడాన్ దేశస్థుడు అందించాడని పేర్కొన్నారు. మరో కేసులో.. దుబాయ్ నుంచి వచ్చిన విస్తారా విమానంలో ముగ్గురు ప్రయాణికుల నుంచి 8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం ధర రూ. 3.88 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ముంబయి విమానశ్రయ కస్టమ్స్ అధికారులను అభినందించారు. అధికారులు సమయానుకూలంగా తీసుకున్న చర్యల వల్లే స్మగ్లర్లు పట్టుబడ్డారని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం
'మా నాన్నను ఎందుకు చంపారు?'.. నళినిని ప్రశ్నిస్తూ ఏడ్చేసిన ప్రియాంక