"30 కిలోల బంగారం... దాదాపు రూ.15 కోట్లు విలువ... ఇద్దరు హైప్రొఫైల్ నిందితులు... ముఖ్యమంత్రిపైనే అనుమానాలు"... సంక్షిప్తంగా కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు వివరాలివి. ఇప్పుడివే కేరళ శాసనసభ ఎన్నికల్లో కీలకాంశాలయ్యాయి. అధికార ఎల్డీఎఫ్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేలా విపక్షాలు ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసును అస్త్రంగా మలుచుకుంటున్నాయి. ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు అధికార పక్షం శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
ఏంటీ కేసు?
2020 జులైలో.. యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి వచ్చిన కార్గోలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్‌ను కొన్ని రోజులకు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు కీలక మలుపులు తిరుగుతూ వచ్చింది.
!['Gold smuggling accused was pressurised to name Vijayan'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10946074_1.png)
తొలుత.. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. సీఎం పినరయి విజయన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్న ఐటీశాఖ కార్యదర్శి శివశంకర్‌ను ఆ బాధ్యతలను తప్పించారు. ఆయన్ను అధికారులు అనేకమార్లు విచారించారు. అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:- 'రాజకీయాలకు 'కస్టమ్స్'ను వాడుకుంటున్నారు'
తాజాగా.. ఈ కేసు మరో అనూహ్య మలుపు తిరిగింది. బంగారం కుంభకోణంలో సీఎంకు ప్రత్యక్ష పాత్ర ఉందని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. నిందితురాలు స్వప్నా సురేశ్.. ఈ విషయాన్ని రహస్య వాంగ్మూలంలో వెల్లడించినట్టు హైకోర్టులో ఇటీవలే దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్నారు.
ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది బయటపడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే.. ఓ పోలీసు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్వప్నా సురేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించి.. సీఎం పేరు చెప్పించేందుకు ఆమెపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుటు ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈడీ స్వప్నను ప్రశ్నించినప్పుడు తాను అక్కడే ఉన్నట్టు పేర్కొన్నారు. విచారణ మధ్యలో అధికారులకు ఏవో ఫోన్‌కాల్స్ వచ్చేవని.. ఆ సమయంలో వారు ప్రశ్నలు అడిగేవారు కాదని వివరించారు.
పినరయి X షా...
ఈ పరిణామాలు.. అధికార ఎల్డీఎఫ్- విపక్ష భాజపా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి దారి తీశాయి. పినరయి విజయన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గత వారం.. కేరళలో చేపట్టిన ఎన్నికల ర్యాలీ వేదికగా.. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై విజయన్ను నిలదీశారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానాస్పద మృతిని షా ప్రస్తావించారు. దీనిపై సీఎం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
!['Gold smuggling accused was pressurised to name Vijayan'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10946074_4.jpg)
!['Gold smuggling accused was pressurised to name Vijayan'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10946074_2.jpg)
!['Gold smuggling accused was pressurised to name Vijayan'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10946074_3.jpg)
షా ఆరోపణలను విజయన్ దీటుగా తిప్పకొట్టారు. తిరువనంతపురం విమానాశ్రయం కేంద్రం చేతిలో ఉందని.. మరి భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. గోల్డ్ స్మగ్లింగ్‌కు అది 'హబ్'గా ఎందుకు మారిందని ఎదురు ప్రశ్నించారు. దీనికి షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. షా 'అనుమానాస్పద మృతి' వ్యాఖ్యలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు కేరళ సీఎం. "మతతత్వానికి షా పెట్టింది పేరు. కిడ్నాప్, నకిలీ ఎన్కౌంటర్ల వ్యవహారంలో జైలుకు వెళ్లింది ఆయనే" అని ఆరోపించారు.
ఇదీ చూడండి:- 'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'
పినరయి విజయన్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి మురళీధరన్ తప్పుబట్టారు. అనవసరమైన విషయాలను ప్రజల ముందుకు తీసుకొచ్చి.. అసలు సమస్యను తప్పుదారి పట్టిస్తున్నట్టు ఆరోపించారు. విజయన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరువనంతపురం విమానాశ్రయం గోల్డ్ స్మగ్లింగ్‌కు హబ్‌గా మారిందని మండిపడ్డారు. దీనికి అమిత్ షాకు సంబంధం లేదని.. ప్రశ్నల నుంచి విజయన్ తప్పించుకోవడం మానుకోవాలన్నారు.
'ఇదంతా డ్రామా...'
భాజపా- సీపీఎం నేతల మధ్య వాగ్వాదాన్ని డ్రామాగా అభివర్ణించింది కాంగ్రెస్. విజయన్- షా.. ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం కురిపించుకుంటున్నారన్న కాంగ్రెస్ నేత ఊమన్ చాంది.. ప్రజలకు కావాల్సింది ప్రశ్నలు కాదని.. సమాధానాలని గుర్తుచేశారు.
అనుమానాస్పద మృతిపై షా లేవనెత్తిన ప్రశ్నలపైనా స్పందించారు కేపీసీసీ చీఫ్ రామచంద్రన్. నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే.. బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇలా కేరళ రాజకీయంలో ప్రధాన అంశంగా మారిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. శాసనసభ ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మే 2నే తేలనుంది.
ఇదీ చూడండి:- కేరళ ఫలితాలను శాసించే 'సామాజిక లెక్క'లు