Gold Ornaments Bag Under Silt : ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. అదే సమయంలో బంగాల్లోని కాలింపాంగ్ జిల్లాలోని అనేక ప్రాంతాలు కూడా ఆ వరదలకు ప్రభావితమయ్యాయి. తీస్తా నది ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా గ్రామాలు ఇప్పటికీ పూడికతోనే ఉన్నాయి. స్థానిక పరిపాలన, అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన బృందాలు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆ సమయంలో అందిరినీ ఉలిక్కిపడేలా చేసే ఓ సంఘటన జరిగింది.
జిల్లాలోని తీస్తా బజార్ ప్రాంతంలో గురువారం యథావిథిగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇళ్లల్లో పేరుకుపోయిన పూడికలను తొలగిస్తున్నారు. ఆదే సమయంలో వరదల్లో సర్వస్వం కోల్పోయిన సుమిత్రా ఛెత్రీ అనే మహిళ.. ఓ బ్యాగును గుర్తించింది. అందులో చిన్న బాక్సులో బంగారు ఆభరణాలు ఉన్నాయి. చిన్న చిన్న సంచుల్లో వెండి వస్తువులు, బంగారు నాణేలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని పంచాయతీ సభ్యుడు నార్డెన్ షెర్పాకు ఛెత్రీ సమాచారం అందించారు. ఆయన వచ్చి బ్యాగ్‌ను తనిఖీ చేశారు.
"సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో ఛెత్రీ అనే మహిళకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.7 నుంచి రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. అవి ఎవరికి చెందినవో తెలియదు. సరైన ఆధారాలు ఉంటే వచ్చి ఛెత్రీ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. ఆధారాలు లేకుంటే అవి ఛెత్రీకే చెందుతాయి" అని పంచాయతీ సభ్యుడు నార్డెన్ షెర్పా ఈటీవీ భారత్‌తో తెలిపారు.
"కొట్టుకుపోయిన ఇంటి పూడికలు తొలగిస్తుంటే.. నాకు బ్యాగ్ కనిపించింది. ఓపెన్ చేయగా.. అందులో ఖరీదైన బంగారు ఆభరణాలు, నాణేలు, వెండి వస్తువులు ఉన్నాయి. అసలు యజమాని ఎవరో వచ్చి తీసుకోండి" అని సుమిత్రా ఛెత్రీ చెప్పింది.
Sikkim Floods : ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సిక్కిం అతలాకుతలం అయ్యింది. వరదల ధాటికి వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లాయి. దీంతో 35 మందికి పైగా మృత్యువాతపడగా.. వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.