Goa Election 2022: 'ఆకాశంలో సగం' అంటూ వేదికలపై మహిళలను ఆకాశానికెత్తేసే రాజకీయపార్టీలు ఎన్నికల్లో పోటీకి మాత్రం వారికి సముచిత స్థానాన్ని కల్పించలేకపోతున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తాజా రాజకీయ చిత్రమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని ఓటర్లలో సగానికి (50%కి) పైగా మహిళలే ఉన్నప్పటికీ.. ప్రధాన పార్టీలు వారికి సగటున కనీసం 8% స్థానాలు కూడా కేటాయించకపోవడం గమనార్హం. గోవాలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని పార్టీల నుంచి ప్రముఖ నేతలు మహిళల ఓట్లే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (భాజపా), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బంగాల్, దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (తృణమూల్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), శివసేన నేత సంజయ్ రౌత్ తదితరులంతా ప్రచారంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. నేతలంతా మహిళా సాధికారత గురించి గొప్పగా ఉపన్యాసాలిస్తున్నారు తప్ప ఎన్నికల్లో పోటీకి మాత్రం వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించలేకపోయారు. ఓ మహిళ నేతృత్వం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలిపిన అభ్యర్థుల్లో 15% మహిళలకు కేటాయించగా.. ఇదే ప్రధాన పార్టీల్లో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం. గోవాలోని మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళల సంఖ్య 31,460 అధికం. అయితే సగటున అన్ని పార్టీలు కలిపి పోటీకి నిలిపిన మహిళల శాతం 8 లోపే ఉండటం గమనార్హం. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ నలుగురు మహిళలకు పోటీకి అవకాశం కల్పించగా.. ఎన్‌సీపీ/శివసేన కూటమి ఒక్కరికి కూడా చోటివ్వలేదు. భాజపా, ఆప్‌లు ముగ్గురికి చొప్పున, కాంగ్రెస్ ఇద్దరికి టికెట్లు కేటాయించింది.
గత ఎన్నికల్లో..
గోవాలో గత ఎన్నికల్లోనూ మహిళలకు కల్పించిన ప్రాతినిధ్యం అంతంతమాత్రమే. 2002లో ప్రధాన పార్టీలు 11 మందికి పోటీకి అవకాశం కల్పించగా.. వారిలో ఒకరు గెలుపొందారు. 2007లో 14 మంది, 2012లో కేవలం 10 మంది మహిళలను పోటీకి నిలబెట్టారు. ఈ రెండు ఎన్నికల్లో ఒక్కొక్కరు చొప్పున విజయం సాధించారు. 2017లో 19 మంది మహిళలకు అవకాశం కల్పించగా ఇద్దరు గెలుపొందారు.
- గోవా ఓటర్లలో హిందువులు 65% కాగా, క్రైస్తవులు 30%, ముస్లింలు 2.81%, ఇతరులు మరో 2.19% ఉన్నారు.
- హిందువుల్లో ఓబీసీలకు 30-40% ఓట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలో మొత్తం 19 ఉపకులాలు ఉండగా, వాటన్నింటిలో భండారీల సంఖ్యే ఎక్కువ. దీంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఫిబ్రవరి 14న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవీ చూడండి: పోలింగ్ ముంగిట.. పార్టీల 'నినాదాల పోరు'
Goa Election 2022: ఆప్ కొత్త పంథా- అభ్యర్థులతో అఫిడవిట్‌పై సంతకాలు