Congress Candidate List: గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండగా చాలా ముందే అభ్యర్థుల పేర్లను వెల్లడించడం గమనార్హం.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ.. అభ్యర్థులను ఖరారు చేసినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.
వీరిలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కూడా ఉన్నారు. ఆయన మడ్గావ్ నుంచి పోటీ చేయనున్నారు.
కామత్ 2012-17 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
Congress Released The List of Candidates:
మపుసా అసెంబ్లీ స్థానంలో.. సుధీర్ కనోల్కర్ బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం సుధీర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర భాజపా ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 2019లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
తాలేగావ్ నుంచి టోనీ రోడ్రిగ్స్, పోండాలో రాజేశ్ వీరేంకర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Goa Assembly Election 2022
గోవా శాసనసభ ఎన్నికలకు సంబంధించి.. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే సూచనలున్నాయి.
ఈ నేపథ్యంలో అన్నింటికంటే ముందే కాంగ్రెస్.. అభ్యర్థులను ప్రకటించి కాస్త ముందంజలో నిలిచి ప్రచారానికి సిద్ధమైంది.
రాష్ట్రంలో ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ ఎన్డీఏ 27 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఆరు స్థానాలకే పరిమితమైంది.
ఇవీ చూడండి: సభకు 'లఖింపుర్' సెగ- నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్