Goa Election 2022: పార్టీ ఫిరాయింపులకు చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త అడుగువేసింది. అలాగే ఓటర్లకు భరోసా ఇచ్చేందుకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 40 మంది అభ్యర్థులతో అఫిడవిట్‌పై సంతకాలు చేయించింది. వారంతా పార్టీకి విధేయులుగా ఉంటారని, ఒకవేళ గెలిస్తే నిజాయతీతో పనిచేస్తారని ఈ అఫిడవిట్ ద్వారా హామీ ఇప్పించింది. తమ అభ్యర్థులంతా నిజాయతీపరులని, ఓటర్లకు భరోసా ఇచ్చేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంది.
'నేతలు తరచుగా పార్టీలు ఫిరాయించడమే గోవా రాజకీయాల్లో అతిపెద్ద సమస్య. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మాకు ఓటు వేసే దానికంటే ముందే ఈ సమస్యను పారదోలాలనుకుంటున్నాం' అంటూ దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత.. అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తమ పార్టీ ఇక్కడ నిజాయతీతో కూడిన ప్రభుత్వాన్ని అందించేందుకు నిశ్చయంతో ఉందని, అందుకోసం ఈ ఫిరాయింపుల సమస్యను వదిలించుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థులు, వారి అఫిడవిట్లను ప్రజల ముందు ఉంచారు. వారు మాట తప్పితే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేజ్రీవాల్ ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్నారు. అక్కడ తన పార్టీని విస్తరించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఇక్కడ పోటీ చేసినప్పటికీ.. ఒక్క సీటు కూడా గెలుచులేకపోయింది. ఇదిలా ఉండగా.. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా భండారీ వర్గానికి చెందిన అమిత్ పాలేకర్‌ను ఎంచుకుంది. ఆ ఓబీసీ వర్గం రాష్ట్ర జనాభాలో 35 శాతం వరకు ఉంటుంది.
గోవాలో ఫిబ్రవరి 14 ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న కౌంటింగ్ చేపట్టనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: టార్గెట్ దిల్లీ.. ముగ్గురు ముఖ్యమంత్రుల సరికొత్త రాజకీయం!