Goa assembly election 2022: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేశారు ఇరు పార్టీల నేతలు. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఇరుపార్టీలు.. కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.
గోవా రాజధాని పనాజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కూటమిపై ప్రకటన చేశారు ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, జితేంద్ర అవ్హాద్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు రౌత్.
'మాతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టం. రానున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-ఎన్సీపీ కూటమి బలాన్ని చూపిస్తాం. మా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పెద్దు కుమారుడు ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తాము.'
- సంజయ్ రౌత్, శివసేన నేత
గోవాలో శివసేన 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇరు పార్టీల నేతలు చర్చించి సీట్ల కేటాయింపునకు తుది రూపును ఇవ్వనున్నారని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ లేకపోవటానికి కారణమేంటి?
ఎన్నికల్లో పొత్తు విషయమై శివసేన- కాంగ్రెస్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే భాజపా బలంగా ఉండే స్థానాలను శివసేనకు కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో శివసేన.. కాంగ్రెస్‌తో పొత్తుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ తరహాలో గోవా సర్కారును ఏర్పాటు చేయాలంటే.. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని ఈ సందర్భంగా శివసేన అడగ్గా.. అందుకు కాంగ్రెస్ నిరాకరించిందనే వాదన వినిపిస్తోంది. అందుకే శివసేన నేతలు కాంగ్రెస్ పట్ల బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
ఇదీ చూడండి: కాంగ్రెస్ లేకుండా శివసేన-ఎన్సీపీ రాజకీయం.. అసలేమైంది?