కర్ణాటక బెల్గాంలో ఇద్దరు బాలికలు బలవంతపు బాల్యవివాహం చేసుకుని శిశువులకు జన్మనిచ్చారు. ఇందుకు కారణమైన వారి భర్తలను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.
వివాహం చేసుకునేందుకు చట్ట ప్రకారం మహిళలకు 18 ఏళ్లు, పురుషులకు 21 సంవత్సరాలు నిండాలి. కానీ ఆ ఇద్దరు బాలికలకు వివాహ వయసు రాలేదు. పరిస్థితుల కారణంగా పెద్దవాళ్లు వారికి చిన్నవయసులోనే వివాహం చేశారు. ఈ క్రమంలో వారు గర్భం దాల్చారు. వివాహ వయసుకు రాని వారిపై జరిగింది లైంగిక దాడిగా పరిగణించిన అధికారులు భర్తలను అరెస్టు చేయించారు.
ఇలా బయటపడింది..
ప్రవస వేదనతో ఇరువురు యువతులు బెల్గాంలోని జిల్లా ఆసుపత్రిలో చేరారు. వారిని చేర్చుకునేందుకు ముందుగా ఆధార్ కార్డుతో పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి వయసును గుర్తించిన అధికారులు స్థానికంగా ఉండే శిశు సంరక్షణ విభాగాధికారులకు సమాచారం అందించారు. సిబ్బందితో ఆసుపత్రికి చేరుకొన్న శిశు సంరక్షణాధికారి రవి రత్నాకర్ వివాహితులతో మాట్లాడి బాల్యవివాహంగా నిర్ధరించున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
108 బాల్యవివాహాలను ఆపిన అధికారులు
కర్ణాటకలో అత్యధికంగా బాల్యవివాహాలు బెల్గాంలో జరుగుతాయని అధికారులు తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 115 బాల్య వివాహ ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే వాటిలో 108ని అడ్డుకున్నట్లు వివరించారు.