ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన వ్యక్తి నాలుకను కోసేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఝార్ఖండ్‌లో ఈ ఘటన జరిగింది. మహిళ ఇంటికి యువకుడు వెళ్లడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ... అతడిని వెంబడించి దాడి చేశారు. చివరకు అతడి నాలుకను కట్ చేశారు. చివరకు యువకుడు అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు.
అనిల్ యాదవ్ అనే వ్యక్తి ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలోని వింధామ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం హరియాణాలో నివసిస్తూ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వింధామ్‌గంజ్‌కు ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రంలోని గఢ్వాకు చెందిన వివాహితతో అతనికి సంబంధం ఏర్పడింది. కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ప్రేమాయణం సాగించారు. ఆదివారం రాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు అనిల్.
ఇంతలో అనిల్ రాకను గమనించిన కొందరు వ్యక్తులు.. అతడిని కర్రలతో రక్తమొచ్చేలా కొట్టారు. ఆ తర్వాత ఒక పదునైన ఆయుధంతో అతని నాలుకను కోసేశారు. ఇంత జరుగుతున్నా.. గ్రామస్థులు అడ్డుకోలేదు. తీవ్రంగా కొట్టడం వల్ల యువకుడు విపరీతంగా గాయపడ్డాడు. ఘటన అనంతరం రక్తపుమడుగులో ఉన్న యువకుడు ఎలాగోలా అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని చూసి షాక్‌కు గురయ్యారు.
ఝార్ఖండ్‌లోని గఢ్వాలో నివాసముంటున్న మహిళ కుటుంబం.. మొదట అనిల్‌ను కొట్టి, ఆపై అతని నాలుకను కత్తిరించారని యువకుడి తండ్రి కామేశ్వర్ యాదవ్ ఆరోపించారు. అనిల్‌ను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడికి చికిత్స కొనసాగుతోంది. యువకుడు అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనూప్ సిన్హా తెలిపారు. 'అతని నాలుకను 2 నుంచి 3 అంగుళాలు కత్తిరించారు. అతనికి ఆపరేషన్ చేసి కుట్లు వేశాం. ప్రస్తుతం యువకుడు మాట్లాడలేకపోతున్నాడు' అని సిన్హా వెల్లడించారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
అనిల్ యాదవ్ అనే యువకుడు హరియాణా రాష్ట్రంలో పనిచేస్తున్నాడని పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ మనోజ్ కుమార్ ఠాకూర్ తెలిపారు. 'అతడు సంబంధం పెట్టుకున్న యువతికి ఇదివరకే వివాహం అయిపోయింది. ఝార్ఖండ్‌లోని గఢ్వాకు చెందిన ఆ వివాహితతో చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడిపించాడు. గతంలో యువకుడు తన ప్రియురాలిని కిడ్నాప్ చేసి హరియాణా తీసుకెళ్లాడు. ఇంట్లో యువతి కనిపించకపోవడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు ఝార్ఖండ్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. యువకుడు ఫిబ్రవరి 27న వివాహితను ఆమె ఇంట్లో వదిలి వెళ్లాడు. అయితే ఆదివారం యువతిని మళ్లీ కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ యువతికి సంబంధించిన వ్యక్తులు యువకుడిపై దాడి చేసి అతని నాలుకను కట్ చేశారు. ఆదివారం రాత్రి వింధామ్‌గంజ్ సలైయాదిహ్ గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు. నాలుక కట్ చేయడం వల్ల ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. యువకుడు కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కేసు నమోదు చేసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం' అని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: