Girl Student Thrown In Front Of Train : వేధింపులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన ఓ విద్యార్థినిని కదులుతున్న రైలు ముందుకు తోసేసింది ఆకతాయిల గుంపు. దీంతో ఆ అమ్మాయి చెయ్యి, రెండు కాళ్లు పూర్తిగా తెగిపోయాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో వెలుగు చూసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాధిత బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు బాధ్యుడైన ప్రధాన నిందితుడితో పాటు అతడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్తో పాటు ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు.
సీఎం దృష్టికి..
ఈ దారుణం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. విద్యార్థిని చికిత్సకు అయ్యే పూర్తి ఏర్పాట్లు చేయాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు.
కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..
బాధిత విద్యార్థిని కోచింగ్ కోసం ఓ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేది. గత రెండు నెలలుగా రోజూ రహదారిపై ఓ యువకుడు ఆ బాలికను వేధించేవాడు. ఈ క్రమంలోనే వేధింపులకు విసిగిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధిత కుటుంబం నిందితుడిని పలుమార్లు హెచ్చిరించింది. అయినా తన ప్రవర్తన మార్చుకోకపోగా ఎప్పటిలాగానే మంగళవారం విద్యార్థిని కోచింగ్‌కు వెళ్లటం చూసి ఆమెను వెంబడించాడు. అలా జిల్లాలోని ఓ రైల్వే క్రాసింగ్ సమీపంలో ఉన్న బాలికను ఒక్కసారిగా అటుగా వేగంగా వస్తున్న రైలు ముందుకు తోసేశాడు. ఇందుకు అతడి స్నేహితులు కూడా సహకరించారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో బాలిక చెయ్యి, రెండు కాళ్లు పూర్తిగా తెగిపోయాయి. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను దగ్గర్లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఇక ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
"ఇది పూర్తిగా ప్రేమ వ్యవహారమని తెలుస్తోంది. ఘటన ఎలా జరిగిందన్న కోణంలో విచారణ జరుపుతున్నాము. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము."
-అశోక్ కుమార్, సిబిగంజ్ ఇన్‌స్పెక్టర్
Newsclick CBI Raid : న్యూస్‌క్లిక్‌పై సీబీఐ కేసు.. రెండు ప్రాంతాల్లో సోదాలు
Man Dragged By Car : ట్యాక్సీ డ్రైవర్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు.. మృతదేహాన్ని వదిలేసి పరార్